‘కత్తి’ వివాదం రాజుకుంటోంది..!

Tuesday, October 21st, 2014, 12:42:27 PM IST


కోలీవుడ్ హీరో విజయ్ లేటెస్ట్ మూవీ ‘కత్తి’ తమిళనాట ఉద్రిక్తతలకు తెర తీసింది. అయంగరన్ ఇంటర్నేషనల్ సమర్పణలో నిర్మితమైన ఈ చిత్ర నిర్మాతల్లో ఓ వ్యక్తి శ్రీలంకకు చెందినవారు కావడమే తమిళుల ఆగ్రహానికి కారణం. దీపావళిని పురస్కరించుకుని తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళనాట ఆందోళనలు తీవ్రమయ్యాయి. చెన్నైలో మూడు థియేటర్లపై తమిళులు దాడులు చేసి, విధ్వంసం సృష్టించారు. నిరసనల తీవ్రత గంటగంటకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం పోలీసు బలగాలను రంగంలోకి దించింది.

తక్షణమే ‘కత్తి’ చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేయాలని తమిళులు డిమాండ్ చేస్తున్నారు. విజయ్ – సమంత జంటగా ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ‘కత్తి’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. అయితే ఈ నిర్మాణ సంస్థతో శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్స కు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికే మహింద రాజపక్స పై తమిళనాడు ప్రజలు ఫైర్ తో ఉన్నారు. ఈ చిత్రం బ్యానర్ నుంచి లైకా పేరు తొలగించాలని వారు ‘కత్తి’ నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు.