హైదరాబాద్ లో ఐపీఎల్ కప్

Thursday, April 5th, 2018, 11:40:43 AM IST

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ పండుగ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆయా జట్ల ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్ర స్థాయిలో కఠోర సాధన చేస్తుండగా.. అభిమానులు టిక్కెట్ల కొనుగోలు చేయడంలో ఉత్కంటత చూపిస్తున్నారు.. ఈ సందర్భంలో ఐపీఎల్ ట్రోఫీ కూడా అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు పలు నగరాల పర్యటనకు బయలుదేరింది. దీనిలో భాగంగా ఐపీఎల్ ట్రోఫీ హైదరాబాద్ నగరానికి వచ్చేసింది. ఓ ప్రైవేట్ షోరూమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ భారత స్పిన్నర్ ఎస్‌ఎల్ వెంకటపతి రాజు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాదీగా నా మద్దతు ఖచ్చితంగా సన్‌రైజర్స్‌ టీంకే ఉంటుంది. డేవిడ్ వార్నర్‌ను మిస్ అయ్యామనడంలో ఎలాంటి సందేహం లేదని రాజు అన్నారు. తెలుగులో మాట్లాడటం నాకు మంచి అనుభూతిగా ఉంటోంది. వీక్షకులతో అనుసంధానం చేస్తుంది. ముఖ్యంగా ఇంగ్లీష్, హిందీలో కామెంటరీని ఇష్టపడని వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని ఆయన అన్నారు. చాలా మంది సూపర్ స్టార్లు రిటైర్ అయిన నేపథ్యంలో ఈసారీ యువ క్రికెటర్లపైనే ప్రధానంగా దృష్టి ఉంటుందని చెప్పారు. అన్ని సంవత్సరాలకంటే ఈ సారి పోటీలు మాత్రం చాలా తారా స్థాయిలో జరుగుతాయన్నారు.