పీఠం కాపాడుకున్న ఉత్త‌మ్‌

Thursday, September 20th, 2018, 02:45:31 PM IST

గ‌త కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బయ‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పీఠం క‌దిలించేందుకు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చాలానే తంటాలు ప‌డ్డారు. అయితే ఉత్త‌మ్ ఇటీవ‌ల దూకుడు పెంచిన తీరు, అటుపై ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మెప్పు పొందిన తీరుతో అంతా స‌ర్ధుకుంది. త‌న పీఠం క‌దిలిపోకుండా కాపాడుకోవ‌డంలో ఉత్త‌మ్ చాలానే జాగ్ర‌త్త వ‌హించారు. త‌న ఛీఫ్ పోస్టుకి ఎలాంటి డోఖా లేకుండా చూసుకున్నారు ఉత్త‌మ్. ఇప్పుడు తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఉత్త‌మ్‌ని న‌మ్మి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని ఎంపిక చేశారు.

మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ప్లానింగ్ .. వ్యూహ విభాగ‌ కమిటీ ఛైర్మన్‌గా వి. హనుమంతరావు, ఎన్నికల సంఘం సమన్వయ కర్తగా మర్రి శశిధర్‌ రెడ్డి వంటి సీనియ‌ర్ల‌ను నియమించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను నియమించి స‌మ‌తూకం పాటించే ప్ర‌య‌త్నం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో తొమ్మిది కమిటీలకు ఛైర్మన్‌, సభ్యులను ఎంపిక చేశారు. 15 మందితో కోర్‌ కమిటీ, 53 మందితో సమన్వయ కమిటీ, 17 మందితో ప్రచార కమిటీ, 35 మందితో మేనిఫెస్టో కమిటీ సహా మొత్తం 9 కమిటీలను ప‌క‌డ్భందీగా ప్లాన్‌ చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మల్లు భట్టి విక్రమార్క, వైస్‌ ఛైర్మన్‌గా డీకే అరుణ అవ‌కాశం అందుకున్నారు. రాష్ట్ర పార్టీ కోర్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఆర్‌సీ కుంతియా వ్యవహరించనున్నారు. ఈ జాబితాను కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్ ఓ స‌మావేశంలో రిలీజ్ చేశారు.