నన్ను జైల్లో పెడితే బావుండేది.. కాంగ్రెస్ పై విహెచ్ కామెంట్స్!

Thursday, September 20th, 2018, 03:14:08 PM IST

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎంతో కాలంగా ఉంటున్న వి.హనుమంత రావు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యారు. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ పదవి తనకు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణాలో ముందస్తు ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ అధిష్టానం తన కార్యకలాపాల కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా నేడు పార్టీ అధిష్టానం పలు ఎన్నికల కమిటీలు వేసింది. ఇందులో విహెచ్ మెచ్చిన ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఆయనకు రాలేదు.

పార్టీ స్ట్రాటజీ – ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా మాత్రమే నిర్ణయించడం విహెచ్ కు ఏ మాత్రం నచ్చకపోవడంతో మీటింగ్ లోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఉండగానే వీహెచ్ .. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీఫ్ ఉత్తమ్ ను నిలదీసినట్టు తెలుస్తోంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తనను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కమిటీ నుంచి పక్కన పెట్టడం కన్నా చంచల్ గూడ జైలులో పెడితే బాగుండేదని వీహెచ్ ఆవేదనతో చెప్పడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. 1989లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత తనదని వివరణ ఇచ్చారు. అదే విధంగా తనకు పార్టీలో సరైన పదవి దక్కకపోవడంలో కేసీఆర్ హస్తం ఉందని విహెచ్ కామెంట్ చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు కోవర్టులుగా మారి తనను పార్టీలో ఉండనివ్వకుండా చేస్తున్నారని. కేసీఆర్ తో సంబంధాలున్న కోవర్టులు పేర్లు త్వరలోనే బయటపెడతానని విహెచ్ తెలిపారు.