మళ్ళీ పోస్టర్ చించిన వీహెచ్ !

Monday, October 8th, 2018, 03:12:37 PM IST

కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అందరికీ సుపరిచితమైన రాజకీయ నాయకుడే. కానీ ఈ మధ్య కాంగ్రెస్ పాలనలో లేకపోయినా ఆయన బాగా పాపులర్ అవడానికి కారణం ‘అర్జున్ రెడ్డి’ సినిమా. ప్రచారంలో భాగంగా చిత్ర యూనిట్ లిప్ కిస్ దృశ్యం ఉన్న అర్జున్ రెడ్డి పోస్టర్లను ఆర్టీసీ బస్సుల మీద అంటించింది. దీంతో వీహెచ్ కు చిర్రెత్తుకొచ్చింది. స్వయంగా వెళ్లి బస్సులను ఆపి మరీ ఆ పోస్టర్లను చింపేసి సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేశారు.

వీహెచ్ చర్య పట్ల కోపగించుకున్న యువత పట్టుబట్టి మరీ సినిమాను బంపర్ హిట్ చేశారు. దీంతో నాలుక కరుచుకోవడం వీహెచ్ వంతైంది. మళ్ళీ ఇపుడు ఇదే పోస్టర్ చింపుడు కార్యక్రమాన్ని చేపట్టారాయన. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బస్సులపై కేసిఆర్ పోస్టర్లు ఉన్నాయంటూ రంగంలోకి దిగి వాటిని చింపడం మొదలుపెట్టారు.

దీంతో ఆగ్రహించిన కేసిఆర్ అభిమానులు సోషల్ మీడియాలో మీరెందుకు పోస్టర్లను అవమానకర రీతిలో చింపి రోడ్డు మీద పడేయడం.. జిహెచ్ఎంసీకి చెబితే వాళ్ళే చూసుకుంటారు కదా అంటూ మండిపడుతున్నారు. మరి ఈసారి ఈ పోస్టర్ల పర్వం గతంలో అర్జున్ రెడ్డికి ఇచ్చినట్టే కేసిఆర్ కు హైప్ ఇస్తుందేమో చూడాలి.