ఔరౌరా! కొత్త ప‌త్రిక పెట్టి టిక్కెట్టు డిమాండ్ చేశాడ‌ట‌!

Saturday, October 6th, 2018, 10:36:35 AM IST

తెలంగాణ రాష్ట్ర స‌మితికి మ‌ళ్లీ వివేక్ షాకిస్తాడా? అంటే అవున‌నే ఫీల‌ర్స్ ని వ‌దులుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో త‌ల‌పండిన నేత వెంక‌ట స్వామి. ఆయ‌న వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు వివేక్‌. అయితే రాజ‌కీయాల్లో వెంక‌ట‌స్వామి ఎంత నిబ‌ద్ధ‌త‌గా వున్నారో అంత నిబ‌ద్ధ‌త వివేక్‌లో లేక‌పోవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. త‌న‌కు ఎప్పుడు ఎలా అవ‌స‌రం అనిపిస్తే అలా ఎన్నిసార్ల‌యినా ఎన్ని పార్టీలైనా మార‌డానికి ఏ మాత్రం సంకోచించ‌డు. బాహాటంగా విమ‌ర్శ‌లు చేసిన వారినే కౌగిలించుకోవ‌డానికి కూడా వెనుకాడ‌ని తత్వం అత‌నిది.

గ‌తంలో కాంగ్రెస్‌లో వుండ‌గా తెలంగాణ రాష్ట్ర స‌మితిని తిట్టిన వివేక్ ఉద్య‌మ స‌మ‌యంలో కాంగ్రెస్‌లో వుంటే లాభం లేద‌ని వెంట‌నే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. తెలంగాణ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన వెంట‌నే ఆల‌స్యం చేయ‌కుండా ఎలాంటి ఆలోచ‌న లేకుండా తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చేశాడు. అయితే ఆ త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎంపీగా గెల‌వ‌లేక‌పోయాడు. తిరిగి మ‌ళ్లీ టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన వివేక్ హైద‌రాబాద్ క్రికెట్ క్ల‌బ్‌ను బ్ర‌ష్టు ప‌ట్టించాడ‌నే అప‌వాదు వుంది. వీ6 ఛాన‌ల్‌ని నిర్వ‌హిస్తున్న ఆయ‌న తాజాగా `ప్ర‌భాత వెలుగు` పేరుతో కొత్త వార్తా ప‌త్రిక‌ను ప్రారంభించారు. దీన్ని ద‌న్నుగా చూసుకుని బ‌లం పెరిగింది అనుకున్నాడో ఏమో కానీ ఏకంగా చెన్నూరు టిక్కెట్ ని త‌న సోద‌రుడు వినోద్ కు ఇవ్వాల‌ని స్వ‌యంగా కేటీఆర్‌నే డిమాండ్ చేశాడు.

అది కేసీఆర్ ద‌త్త‌పుత్రుడు బాల్క‌సుమ‌న్ కు కేటాయించిన సీటు. ఇంత‌కుముందు ఆ స్థానం నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే న‌ల్లా ఓదేలు అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం..మీడియాలో దీనిపై దుమారం రేగ‌డం…ఆ త‌రువాత కేసీఆర్ రంగంలోకి దిగి ఓదెలును బుజ్జ‌గించ‌డం జ‌రిగిపోయాయి. ఇంత త‌తంగం జ‌రిగినా ఆ సీటు నుంచి పోటీ చేస్తున్న‌ బాల్క‌సుమ‌న్ ను త‌ప్పించి వినోద్ కు టికెట్ కేటాయించ‌డం కుద‌ర‌ద‌ని వివేక్‌కు కేటీఆర్ ఖ‌రాకండీగా చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంచి నీళ్లు తాగిన‌ట్లుగా.. బ‌ట్ట‌లు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వివేక్ త‌న అహం దెబ్బ‌తిన్న త‌రువాత కూడా టీఆర్ఎస్ ని ప‌ట్టుకు వేళాడ‌తాడా? తిరిగి మ‌ళ్లీ కాంగ్రెస్ లోకి జంపింగ్ చేయ‌డు. అదే జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.