రాధా గారికి సెంట్రల్ టికెట్ ఇవ్వకుంటే బెజవాడలో వైసీపీ పార్టీనే లేకుండా చేస్తాం..!

Friday, September 21st, 2018, 01:07:19 PM IST

ఇప్పుడు విజయవాడలో వైసీపీ పార్టీ వారి పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి వెనక్కి వెళ్తే గొయ్యి అన్న సందిగ్ద పరిస్థితిలోకి వెళ్ళిపోయింది.ఎప్పుడైతే విజయవాడ సెంట్రల్ టిక్కెట్టు వంగవీటి రాధా గారికి కాదని మల్లాది విష్ణు గారికి కేటాయించాము అని వైసీపీ అధిష్ఠానం ప్రకటించిందో అప్పటి నుంచి వైసీపీ పార్టీ మరియు వంగవీటి అభిమానుల మధ్య పెద్ద దుమారమే చెలరేగింది,దీనితో కొంత మంది వంగవీటి అభిమానులు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశారు.వైసీపీ కార్యదర్శి అయినటువంటి వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ గారు కూడా రాజీనామా చేసి తన నిరసనను వ్యక్తపరిచారు.

ఇదే సందర్భంలో అభిమానులను ఎలాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని,రాధ ముందు నుంచి సర్ది చెప్పుకుంటూనే వస్తున్నారు.రెండు రోజులు కావస్తున్నా వై ఎస్ జగన్ వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదని,పార్టీ టిక్కెట్టు విషయంలో అంబటి రాంబాబు గారు కూడా పార్టీ టిక్కెట్టు కేటాయించిన చోటే పోటీ చెయ్యాలని లేకపోతే పార్టీ నుంచి వీడి వెళ్ళిపోయినా నష్టం లేదని అన్నట్టుగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై వంగవీటి అభిమానులు మరింత మండిపడుతున్నారు,రాధా గారి కోసమే ఇన్నాళ్లు వైసీపీ పార్టీ జెండా మోసాం అని ఇప్పుడు ఆ జెండా ఎవరో వేరే వాళ్ళు వచ్చి లాగేసుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం అని అన్నారు,అదే సమయంలో ఐదేళ్లుగా సెంట్రల్ సీటుపై ఆశ పెట్టుకున్న రాధ గారికి గాని అన్యాయం జరిగితే బెజవాడ నగరంలో వైసీపీ పార్టీ అనేదే లేకుండా చేస్తాం అని వంగవీటి అభిమానులు హెచ్చరించారు.బెజవాడలో రాధ గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అందుకోసమే తాము టిక్కెట్టు వేరే వాళ్లకి కేటాయించాము అని వైసీపీ వారు ససేమిరా అంటున్నారు.