బెజ‌వాడ రాజ‌కీయాల్లో వంగ‌వీటి ప్ర‌కంప‌నం!

Sunday, September 23rd, 2018, 09:56:12 AM IST

ఎన్నిక‌ల వేడి రాజుకుపోతున్న వేళ ఏపీ ఆర్థిక‌రాజ‌ధాని కేంద్రం విజ‌య‌వాడ‌లో రాజ‌కీయాలు ర‌చ్చ‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా వైసీపీలో వంగ‌వీటి రూపంలో ఊహించ‌ని ముస‌లం రాజుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న వంగ‌వీటి రాధా వ‌ర్గానికి ఏమాత్రం రుచించ‌డం లేదు. విజ‌య‌వాడ ఈస్ట్ నుంచి రాధా పోటీ చేయాల‌న్న‌ది జ‌గ‌న్ అభిమ‌తం. కానీ దానిని రాధా, అత‌డి అనుచ‌ర‌ వ‌ర్గం అస్స‌లు అంగీక‌రించ‌డం లేదు. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టిక్కెట్టు మాత్ర‌మే త‌మ‌కు కావాల‌ని రాధా డిమాండ్ చేస్తున్నారు. అయితే కాపు ఓటు వ‌ర్గం అధికంగా ఉన్న విజ‌య‌వాడ‌- తూర్పు అయితేనే రాధాకు బావుంటుంద‌నేది జ‌గ‌న్ వాద‌న‌.

అయితే అందుకు స‌సేమిరా అంటున్నారు రాధా. ఆ క్ర‌మంలోనే త‌న‌దారి తాను చూసుకునేందుకు రాధా, అత‌డి అనుచ‌రులు ఇప్ప‌టికే స‌న్న‌ద్ధంగా ఉన్నార‌ట‌. ఒక‌వేళ పార్టీ మారితే అత‌డు జ‌న‌సేన‌లో చేరే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు బిగిస్తున్న జ‌న‌సేన పార్టీ ఊపు విజ‌య‌వాడ‌లోనూ బాగానే క‌నిపిస్తోంద‌న్న‌ది ఓ విశ్లేష‌ణ‌. అందుకే రాధా ఇప్ప‌టికే ప్రిపేర్డ్‌గా ఉన్నార‌న్న మాట వినిపిస్తోంది. ఇక‌పోతే వైకాపా వ‌ర్గాలు రాధాను బుజ్జ‌గించే ప‌నిలో బిజీగా ఉన్నాయి. మ‌రోవైపు.. మ‌ల్లాది విష్ణుకు తాము వ్య‌తిరేకం కాద‌ని, అత‌డికి విజ‌య‌వాడ ఎంపీ టిక్కెట్టు ఇవ్వ‌డం ద్వారా త‌మ‌కు సెంట్ర‌ల్ టిక్కెట్టు ఖాయం చేసే ఛాన్సుంటుంద‌ని రాధా వ‌ర్గాలు అధినేత‌కు సంకేతాలు అందిస్తున్నారు. ఒక‌వేళ ఈ ప‌న్నాగం పార‌క‌పోతే రాధా ఇక పార్టీ మారేందుకు ఆలోచిస్తున్నార‌ని జ‌గ‌న్‌కి సిగ్న‌ల్స్ పంపార‌ట‌. వైకాపా పార్టీ అంత‌కంత‌కు దిగ‌జారుతున్న వైనం చూస్తుంటే ఆ పార్టీలోనే ఉండాల‌న్న ఆలోచ‌న రాధాకు లేద‌ని, అందుకే అత‌డి డిమాండ్లు కూడా పీక్స్‌కు చేరుకున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. ఇక రాధా తేదేపా నుంచే వైకాపాలో చేరారు కాబ‌ట్టి, మ‌ళ్లీ తేదేపాలో చేరే ఆస్కారం అస్స‌లు లేనేలేదు. అలానే ఇన్నేళ్ల ఏపీ పాల‌నలో క‌మ్మ‌, రెడ్డి సీఎంలు త‌ప్ప వేరే సీఎం లేక‌పోవ‌డం కాపుల్లో తీవ్ర అసంతృప్తిని ర‌గిల్చింది. ఈసారి కాపులంతా మునుప‌టితో పోలిస్తే ఐక్యంగా మారారు. అవ‌స‌రం అయితే రెడ్డి సామాజిక వ‌ర్గం, బ‌డుగు-బ‌ల‌హీన వ‌ర్గాల్ని క‌లుపుకుని క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఆస్కారం లేకుండా చేయాల‌న్న ఎత్తుగ‌డ‌ను నాయ‌కులు అనుస‌రిస్తున్నారన్న స‌మాచారం ఉంది. ఆ క్ర‌మంలోనే తేదేపాకి ప్ర‌తికూలంగా మారుతోంది స‌న్నివేశం. విజ‌య‌వాడలో రాధాకు ఉన్న బ‌లం ఏపాటిదో తెలిసిందే. ఆ వ‌ర్గం బెజ‌వాడ రాజ‌కీయాల్లో కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతోంది. జ‌స్ట్ వెయిట్ ఏం జ‌ర‌గ‌బోతోందో?