విజ‌య‌వాడ సెంట్ర‌ల్.. మ‌ల్లాది విష్ణు వ‌ర్సెస్ వంగ‌వీటి రాధ.. ఇదే ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్..!

Thursday, October 11th, 2018, 11:36:33 AM IST

ఏపీలో ఎన్నిక‌ల హ‌డావుడి ఊపందుకుంది. సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌యం ఆస‌న్న‌మ‌వ‌డంతో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌చారాలతో రాష్ట్రంలో హోరెత్తిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో అధికార టీడీపీ ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు, ప్ర‌తిప‌క్ష వైసీపీ ప్ర‌జాసంక‌ల్ప‌యాత్రం, కొత్త‌గా రేసులోకి వ‌చ్చిన జ‌న‌సేన యాత్ర పేరుతో త‌మ త‌మ ప్ర‌చారాలు ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నారు. ఇక ఈ మ‌ధ్య‌లో రోజుకో స‌ర్వేలు కూడా తెర‌పైకి వ‌చ్చి రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపుతోంది. ఇక అధికార ప్ర‌తిప‌క్షాలు కూడా నియోజ‌క వర్గాలుగా స‌ర్వేలు చేయించుకుంటూ. ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో నిల‌బెట్టేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు.

ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. వంగ‌వీటి రాధ రాజ‌కీయ భవిష్య‌త్తు పై రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ‌లే జ‌రుగుతున్నాయి. వైసీపీలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఆ పార్టీలోకొన‌సాగుత‌న్న వంగ‌వీటి రంగా కుమారుడైన రాధా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుండి వైసీపీ త‌రుపున టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే.. రానున్న ఎన్నిక‌ల్లో అక్కడి నుండే బ‌రిలోకి దిగేందుకు రాధా మాన‌సికంగా సిద్ధం అయ్యారు. అయితే గ‌త ఏడాది మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల్లో రాధా చురుగ్గా పాల్గొన‌క‌పోవ‌డం.. మ‌రోవైపు మ‌ల్లాది విష్ణుకు అక్క‌డ బ‌ల‌మైన ఓటుబ్యాంకు ఉండ‌డంతో విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌కవ‌ర్గ ఇన్‌చార్జిగా మ‌ల్లాది విష్ణును నియ‌మించారు వైసీపీ అధినేత జ‌గ‌న్.

దీంతో ఒక్క‌సారిగా వంగ‌వీటి రాధా వర్గంలో అసంతృప్తి తీవ్ర‌స్థాయిలో ఏర్ప‌డింది. విజ‌య‌వాడలో ఇప్పుడు మ‌ల్లాది విష్ణు వ‌ర్సెస్ వంగ‌వీటి రాధా అన్న‌ట్టు త‌యారైంది. వైసీపీ అధిష్టానం కూడా మల్లాది విష్ణు వైపే మొగ్గు చూప‌డంతో… రాధా పార్టీ వీడాల‌ని ఆయ‌న అనుచ‌రులు సూచించార‌ని స‌మాచారం. అయితే గ‌తంలో ప్ర‌జారాజ్యంలోకి వెళ్ళి భంగ‌ప‌డిన రాధ మ‌రోసారి అలాంటి నిర్ణ‌యం తీసుకోవాడానికి కూడా వెనుకాడుతున్నాడ‌ని తెలుస్తోంది. కానీ రాధా పార్టీ మార‌నున్నాడ‌నే లీకులు మాత్రం వైసీపీ అధిష్టానం వ‌ర‌కు చేరాయి. దీంతో వైసీపీలో ముఖ్య‌మైన సీనియ‌ర్ నేత‌లు.. రాధాతో స‌మావేశ‌మై ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీ మ‌రొద్ద‌ని.. వైసీపీలోనే ఉంటే మునుముందు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని రాధాకి చెప్పిన‌ట్టు స‌మాచారం. అంతే కాకుండా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా రాధా భ‌విష్య‌త్తు పై గ‌ట్టిగానే హామీ ఇచ్చార‌ని తెలుస్తోంది. దీంతో పార్టీ మారినా త‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని నిర్ణ‌యించుకున్న రాధా వైసీపీలోనే కొన‌సాగేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశార‌ని స‌మాచారం.