ఇష్టం వచ్చినట్లు మారడం కాదు.. దమ్ముంటే అలా చేయండి: వెంకయ్య నాయుడు

Tuesday, February 13th, 2018, 02:20:55 AM IST

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. ప్రతిపక్ష నేతల విమర్శలకు తనదైన రీతిలో సమాధానాలిస్తుంటారు. నేడు తమిళనాడు గవర్నర్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి కొణిజేటి రోశయ్యకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని, వివిధ శాఖల్లో ఎన్నాళ్లగానో తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను సత్కరించడం మన సంప్రదాయం అన్నారు. ఎటువంటి పదవి చేపట్టినప్పటికీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రోశయ్య న్యాయం చేశారని చెప్పారు. నిబద్ధత, క్రమశిక్షణతో ఏదైనా సాధ్యమన్నారు. పార్టీల్లోకి వలసలు వెళుతున్న నేతలపై కూడా ఆయన స్పందించారు.

ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారే విధానం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నచ్చిన వారు తమకు నచ్చిన పార్టీలో చేరడంలో తప్పు లేదన్నారు. కానీ పదవుల్లో ఉంటూ వేరే పార్టీలో చేరడం మాత్రం సరికాదని వెంకయ్య చెప్పారు. కానీ ఒకవేళ పార్టీ మారదలచుకుంటే ఆ పార్టీ వల్ల వచ్చిన పదవులను వదులుకొని వేరే పార్టీలో చేరడం మంచి పద్ధతి అని అన్నారు.అయితే తాను ఏపీ, తెలంగాణల గురించి చెప్పడం లేదని, దేశం మొత్తంలోని పార్టీల్లోని ఈ విధానం గురించి మాట్లాడుతున్నానని అన్నారు. ప్రజల తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే అన్నారు.మనం పుట్టిన నేల, ప్రాంతాన్ని ఎప్పటికి మర్చిపోకూడదని, ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దని చెప్పడం లేదని, కానీ మాతృభాషను మాత్రం మరిచిపోవద్దన్నారు.

ఆంధ్ర లో తెలుగు ఒకలా ఉంటుందని, అదే తెలంగాణాలో మరోలా ఉంటుందని అన్నారు. అలానే తెలంగాణ ప్రాంతంలో ఉత్తర తెలంగాణలో భాష ఓ రకంగా, దక్షిణ తెలంగాణలో మరో రకంగా ఉంటుందన్నారు. దట్స్ ది బ్యూటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని వెంకయ్య అన్నారు. మమ్మీ, డాడీ అనే పదాలు మన పెదవిచివరి నుండి వస్తాయని, అదే అమ్మ, నాన్న అనే పిలుపులో వుండే కమ్మదనం గుండె లోతుల నుండి వస్తుందని, మన భాషలో రమ్యత ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా ఉత్తరాదివారు దక్షిణాది భాషలను, దక్షిణాదివారు ఉత్తరాది భాషలను నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. మన కట్టు, బొట్టు, ఆట, పాట, భాష, యాస, గోస ఇటువంటివన్నీ మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపడుతాయని, వాటిని కాపాడుకోవడానికి మనవంతు కృషి అందించాలని అన్నారు. చట్ట సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఐదు రోజుల్లో రాజ్యసభ, లోకసభల్లో ఏ విధమైన ప్రశ్నోత్తరాలు కూడా జరగకపోవడం దారుణం అన్నారు….