భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చేస్తుందన్న కేంద్రమంత్రి…!

Saturday, January 28th, 2017, 01:45:26 AM IST

venkainaidu
ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అభివృద్ధి విషయంలో దేశంలో ఉన్న రాష్ట్రాల మధ్య పోటీ నెలకొందని, అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందుకే ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంస్థలను కేటాయించినట్లు వెంకయ్య నాయుడు చెప్పారు. సమర్ధవంతమైన నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ రెండంకెల వృద్ధి రేటును సాధిస్తుందని వెంకయ్య కొనియాడారు. శుక్రవారం విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ప్రస్తుతం బలమైన నాయకుడు, స్థిరమైన ప్రభుత్వం ఉందని అన్నారు. అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, సంస్కరణలకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తుందని వెంకయ్య అన్నారు. దేశ సమ్మిళిత అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలనీ వెంకయ్య అన్నారు. ప్రజల ఆలోచన విధానంలో మోడీ మార్పు తీసుకొచ్చారని, గతంలో ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వం వైపు చూసే వారని, ఇప్పుడు ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారని వెంకయ్య అన్నారు. ప్రధాని పిలుపుతో 1.40 కోట్ల మంది గ్యాస్ సబ్సిడీ వదులుకున్నారని, రెండున్నర సంవత్సరాలలో దేశంలో ఒక స్కాం కూడా జరగలేదని, అవినీతి రహితంగా దేశంలో పాలన సాగుతుందని వెంకయ్య స్పష్టం చేశారు.