విజయసాయి రెడ్డి ట్వీట్స్: “మనసులో మాట” పుస్తకం ఎక్కడ..?

Sunday, January 13th, 2019, 10:29:53 AM IST

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ట్విట్టర్ లో సెటైర్ వేశారు, తన ఆత్మ కథను తానే ఖండించుకున్నారని, బహుశా ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి చంద్రబాబు ఒక్కడే అయ్యుంటాడని అన్నారు. చంద్రబాబు రాయించుకున్న “మనసులో మాట” పుస్తకంలో వ్యవసాయం దండగ అని అన్నారని, వ్యయసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తే ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అన్న చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు కృషి చేస్తున్నట్టు నటిస్తున్నారని అన్నారు. ప్రతి విషయంలో యు టర్న్ తీసుకుంటూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన కానీ, చిత్తశుద్ధి కానీ లేనటువంటి వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన ఆత్మ కథను తానే ఖండించుకుంది దేశంలో, ప్రపంచంలో చంద్రబాబు ఒక్కడే అని అన్నారు. తాను రాయించుకున్న పుస్తకం మనసులో మాట పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం మార్కెట్ లో ఎక్కడా దొరకకుండా చేసాడని అన్నారు.

చంద్రబాబు రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకున్నప్పటి నుండి కాంగ్రెస్ కు కష్టాలు వచ్చి పడుతున్నాయని అన్నారు. యూపీలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి అఖిలేష్ యాదవ్, మాయావతి ఇద్దరు కలిసి వేరుగా పోటీ చేస్తున్నాం అని ప్రకటించారని, అంతే కాకుండా యూపీఏతో కలవకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని అన్నారు, ఇంకెక్కడ యూపీఏ అని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు పై సెటైర్లు వేశారు.