ఎన్నికల అధికారిపై గ్రామస్తుల దాడి…

Friday, December 7th, 2018, 05:40:09 PM IST

సూర్యాపేట జిల్లాలో హుజూర్ నగర్ ప్రాంతంలోని మేళ్లచెరువు మండలం వెల్లటూరు గ్రామంలో పోలింగ్ ఆఫీసర్ పై గ్రామస్తులు దాడి చేశారు. ఒక వృద్ధునికి బదులు తానె, తనకు నచ్చిన పార్టీ కి ఓటు వేశారని గ్రామస్తులందరూ ఏకమై అధికారి పై దాడి చేశారు. దివ్యాంగుడైన ఓ వృద్ధుడికి సహాయం చేసేందుకు సహకరించిన పోల్ ఆఫీసర్, ఆయన ఒక గుర్తుకు వేయమంటే ఈయన మరో గుర్తుపై ఓటు వేయించారని ఆ వృద్ధుడు చెబుతున్నారు.

తానూ వేసిన ఓటు పై ఆ వృద్ధుడు అభ్యంతరం వ్యక్తం చేయగా అక్కడున్న వారందరు కూడా పోల్ ఆఫీసర్ తో గొడవకి దిగారు. ఆ ఆఫీసర్ తో ఇలా చేయడమేంటని నిలదీయడంతో అక్కడ అంతా ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతటితో ఆగకుండా ఆ గ్రామస్తులు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఆయనపై దాడికి దిగారు. చివరకు పోలీసులు వచ్చి ఆ గొడవని ఆపించేశారు. దీంతో గంటసేపు పోలింగ్ ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా తప్పు చేశిన ఆ పోల్ ఆఫీసర్ ని, ఎన్నికల సిబ్బంది అక్కడ నుండి పంపించి వేశారు. ఈ ఘటనపై రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ కోరినట్లు సమాచారం.