వైరల్ న్యూస్ : వైసిపి అవిశ్వాసానికి టిడిపి మద్దతు?

Thursday, March 15th, 2018, 06:43:54 PM IST

ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా బదులు అప్పట్లో ప్రత్యేక బడ్జెట్ ను అమలు చేస్తామని కేంద్ర చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి, అలానే నూతన రాజధాని అభివృద్ధికి పెద్దగా ఏమి చేయలేదని పలువిమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. అలానే ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆఖరి బడ్జెట్ లో కూడా ఆంధ్రకు మొండి చెయ్యి చూపించడంతో, అధికార టిడిపి సహా ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రం పై నిరసన వ్యక్తం చేశాయి.

ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా నినాదాన్ని తొక్కేసిందని ప్రాధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్,అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అందుకే ఇకపై హోదానినాదాన్ని గట్టిగా వినిపించేలా అటు జగన్, ఇటు పవన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆంధ్రకు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న విషయం తెలిసిందే.

ఈ విషయంపై అందుబాటులో ఉన్న మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్త అందుతోంది. రేపు వైసీపీ ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి తమ ఎంపీలు మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్ఠ్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయమని తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా తాము మద్దతిస్తామని కొందరు టీడీపీ నేతలు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది….