వైరల్ వీడియో : టాయిలెట్ శుభ్రం చేసిన ఎంపీ

Sunday, February 18th, 2018, 07:15:00 PM IST

తమ స్థాయి, హోదాను ప్రదర్శించడంలో రాజకీయ నాయకులు అందరికంటే ముందుంటారనే ఒక విమర్శ వుంది. అందునా మరీ ప్రత్యేకంగా ఈ రోజుల్లో ఏ నాయకుడు తమ హోదానుఎంత గొప్పగా ప్రదర్శిస్తే వారు అంత గొప్ప అనే ఒక వాదన ఉండనే వుంది. అంతే కాక గల్లీలోని ఛోటామోటా నాయకుడు కూడా అనుచరగణం లేనిదే పర్యటనలకు వేళ్ళని రోజులివి. ఆ అనుచరులు రాజకీయ పర్యటనల సందర్భంగా తమ నేతలు కనుసైగ చేస్తే చాలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి అటువంటి పరిస్థితులు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా ఓ ఎంపీ స్థాయి వ్యక్తి తన గొప్ప హృదయంతో అందరి మనసులు గెలుచుకున్నారు. పక్కన తన అనుచరులు తోటి సహఅధికారులు ఉన్నా ఏ మాత్రం బింకం లేకుండా, ఎటువంటి హుకుం ప్రదర్శించకుండా స్వయంగా తానే మరుగుదొడ్డిని శుభ్రం చేసి పలువురికి ఆదర్శప్రాయగా నిలిచారు. తన హోదాను మరిచి సింప్లిసిటీని ప్రదర్శించిన ఆ ఎంపీపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

మధ్యప్రదేశ్ లోని రివా నియోజకవర్గ ఎంపీ బీజేపీ నేత జనార్ధన్ మిశ్రా నిన్నఓ పాఠశాలను సందర్శించారు. అయితే తమ పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేక తాము కాలకృత్యాల కోసం రోజు బయటకు వెళ్తున్నామని అక్కడి విద్యార్థులు ఎంపీ కి విన్నవించుకున్నారు. వారి సమస్యను విన్న ఎంపీ మిశ్రా వెంటనే ఆ మరుగుదొడ్డిని శుభ్రం చేయడానికి పూనుకున్నారు. వాస్తవానికి ఆయన ఆదేశిస్తే తక్షణమే సిబ్బంది శుభ్రం చేసే ఏర్పాట్లు చేసే అవకాశం ఉన్నాకానీ స్వయంగా ఆయనే చీపురు చేతబట్టి మరుగుదొడ్డిలో ఇరుక్కున్న మట్టిని తన చేతులతో తొలగించి అంతా శుభ్రం చేశారు. స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగంగా తాను ఈ విధంగా చేశానని తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను జనార్దన్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో పెను సంచలనం సృష్టిస్తోంది. కాగా కొద్దిగా కూడా గర్వం, ఆడంబరత ప్రదర్శించకుండా ఒక సాధారణ పౌరుడిగా తన బాధ్యతతో వ్యవహరించి మరుగుదొడ్డిన శుభ్రం చేసిన ఎంపీ మిశ్రాకు నెటిజెన్ల నీరాజనాలు పలుకుతున్నారు….