వైరల్ వీడియో : ట్రైన్ లో మహిళ పై లైగిక దాడి… పట్టించుకోని తోటి ప్రయాణీకులు

Saturday, April 7th, 2018, 03:09:00 AM IST

ఈ డిజిటల్ యుగంలో మనం ఎంత ముందుకు పోతున్నప్పటికీ మనలో కొందరు మాత్రం మృగాళ్ల లా ప్రవర్తిస్తూ ఆడవారిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. నాగరికత వల్ల మనిషి అభివృద్ధి చెందడం అంటే అది కేవలం డిజిటల్ గా మాత్రమే కాదు మానసికంగా కూడా ఇతరుల, మహిళల పట్ల సుహృద్భావము తో మెలగటం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో ఆడవారిపై లైంగిక దాడులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు. అంతే కాదు మన ఇంట్లోని ఆడవారికి సమస్య వస్తే ఒకలా, అదే బయటి వారికీ అయితే మరోలా వ్యవహరిస్తున్న నేటి మనిషి తీరు నిజంగా హేయమైనది, నీచమయినది అని వారంటున్నారు.

నేడు ముంబై రైల్లో జరిగిన ఒక సంఘటన తీరు చూస్తే మానవత్వం పూర్తిగా మంటగలిసిపోయిందనటానికి ఇంతకన్నా రుజువు అవసరం లేదు అనిపిస్తుంది. విషయం ఏమిటంటే, ముంబయిలోని లోకల్ ప్యాసింజర్ రైలులో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్‌కు బయల్దేరిన ఓ లోకల్ రైలు కల్యాణ్, దాదర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉండగా ఓ మహిళపై ఓ మృగాడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆశ్చర్యమేమిటంటే చుట్టూ చాలా మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఒక్కరూ కూడా ఆ దారుణాన్ని ప్రశ్నించడానికిగాని, లేదా ఎదిరించడానికి గాని ప్రయత్నించలేదు. అంతేగాక, ప్రయాణికుల్లో కొంత మంది ఈ దృశ్యాలను వీడియో తీశారు. చివరకు ఓ ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించడంతో తదుపరి స్టేషన్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అతడిపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నిందితుడి పేరు రఫీక్ షేక్ గా గుర్తించిన పోలీసులు.. బాధిత మహిళకు ఆయన ముందే తెలుసని, ఆమె వద్ద గతంలో డబ్బు అప్పుగా తీసుకున్నాడని, ఈ క్రమంలోనే రైల్లో ఇలా దాడికి పాల్పడినట్లు తెలుసుకున్నారు. ఈ దృశ్యాలను కొందరు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కళ్లముందే ఇంతటి దారుణం జరుగుతున్నా అడ్డుకునే ప్రయత్నం చేయకుండా ప్రయాణికులు సినిమా చూసినట్లు చూడడంపై పలువురు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments