వివో విడుదల చేస్తున్న10 జిబి రామ్ మొబైల్ !

Tuesday, January 30th, 2018, 03:00:54 PM IST

మొబైల్ తయారీ రంగంలో వారానికొక కొత్త రకమైన మొబైల్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవడం చూస్తూనే వున్నాం. కంపెనీలు కూడా వేటికవే పోటీపడుతూ పలురకాల ఫీచర్ లను అప్డేట్ చేస్తూ ఫోన్లు విడుదల చేస్తున్నాయి. అయితే చైనా మొబైల్ సంస్థ వివో ఈ సంవత్సరం 10 జిబి రామ్ మొబైల్ విడుదలకు సన్నాహాలు చేసినట్లు సమాచారం వస్తోంది. ఇప్పటివరకు 10 జిబి రామ్ సామర్థ్యం వున్న మొబైల్స్ రాలేదనే చెప్పాలి. 2016 లో లాంచ్ చేసిన వివో ఎక్స్ ప్లే 6 కు సక్సెసర్ గా దీన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం విడుదల కానున్న ఫోన్ లలో ఇది ప్రత్యేక ఆకర్షణ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. వివో 7 పేరుతో రానున్న ఈ వేరియంట్ లో 4కె ఓఎల్ఈడి డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 845 సిస్టం ఆన్ చిప్, 512 జిబి స్టోరేజీ, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రత్యేకతలున్నాయని తెలుస్తోంది. 4 ఎక్స్ ఆప్టికల్ జూమ్ తో డ్యూయల్ రేర్ కెమెరాను కలిగివుంటుందట. అయితే 512 జిబి నే కాక 256 జిబి స్టోరేజి వేరియంట్ లో కూడా లభ్యం కానున్నట్లు తెలుస్తోంది. ధర, అందుబాటులో వున్న ఇతర వివరాల గురించి మాత్రం సమాచారం లేదని, కానీ 500 డాలర్లు, మన కరెన్సీ ప్రకారం రూ. 31,800 కు లభ్యం కావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వివో ఇదివరకు ఎక్స్ 20 ప్లస్ యుడి స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. అయినప్పటికీ 10 జిబి రామ్ సహిత అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తున్న తొలి మొబైల్ ఇదే కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ మొబైల్ ఇంక మార్కెట్ లోకి విడుదలయ్యాక ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి…..