మెదక్ లో మొదలైన ఉపఎన్నిక

Saturday, September 13th, 2014, 11:02:08 AM IST


తెలంగాణ మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాజీనామా అనంతరం ఖాళీ అయిన ఎంపీ స్థానానికి నేడు ఉపఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో మెదక్ లోక్ సభ ఉపఎన్నిక ప్రక్రియ శనివారం ఉదయం 7గంటలకు మొదలైంది. కాగా ఈ స్థానం పరిధిలో పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్, సంగారెడ్డి, నర్సాపూర్,మెదక్, సిద్ధిపేట నియోజకవర్గాలకు చెందిన 15,43,422మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా ఈ ఉపఎన్నిక కోసం 1817 పోలింగ్ కేంద్రాలను, 9వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఇక మెదక్ ఎంపీ స్థానం కోసం ఎన్నికల పోటీలో తెరాస నుండి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి సునీతా లక్ష్మారెడ్డి మరియు టిడిపి-బీజేపి పొత్తు అభ్యర్ధి తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) ఉన్నారు. కాగా శనివారం సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఇక మెదక్ జిల్లా సిద్దిపేటలో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు చాలా విలువైనదని, ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం 11గంటల ప్రాంతానికి సిద్ధిపేట మండలం చింతమడకలో తన ఓటును వినియోగించుకుంటారని హరీష్ రావు పేర్కొన్నారు.