మరింత ముదురుతున్న ఏపీ టీడీపీ-బిజెపి వివాదం !

Monday, February 5th, 2018, 10:07:21 AM IST

కేంద్ర ఎన్డీయే ప్రభుత్వంలోని బిజెపి, అధికార టిడిపి కి మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో విబేధాలు మరింత పెరిగే దిశగా పరిణామాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇరుపార్టీల నేతలు ఉప్పు, నిప్పుల వలె వ్యవహరిస్తున్నట్లు అర్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ తర్వాత ఇరు పార్టీ ల నాయకుల విమర్శనాస్త్రాలు శృతిమించుతున్నాయని అర్ధమవుతోంది. ముఖ్యంగా ఏపీలోని భాజపా నాయకుల్లో సోము వీర్రాజు, తెలుగుదేశం నాయకులను తనదైన రీతిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబు కూడా ఆ మధ్య మాట్లాడుతూ బిజెపి పార్టీ నే తమ తో మిత్రత్వం కోరుకుందని, కావాలంటే ఇప్పుడైనా వారికొక నమస్కారం పెట్టి తప్పుకుంటామని చేసిన వ్యాఖ్యలు విదితమే. ఎందుకంటే, రాష్ట్ర భాజపా సంయమనం పాటించాలి, తమ ప్రభుత్వం పట్ల సానుకూలంగా మాత్రమే మాట్లాడుతూ ఉండాలి అని కేంద్రంలోని అధిష్టానం నుంచి ఎన్ని సూచనలు వచ్చినప్పటికీ, అలాంటి సూచనల్ని ఖాతరు చేయకుండా,ఛాన్సు దొరికితే చాలు చంద్రబాబు మీద ఆయన పాలన మీద అడ్డంగా విరుచుకుపడుతున్నారు సోము వీర్రాజు. నిజానికి ఏపీలో ఆయనకే పార్టీ అధ్యక్షపగ్గాలు కూడా అప్పగిస్తారని అంతా అనుకున్నారు గానీ, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయం లో ఈ విభేదాల రాజకీయాలు ఎందుకని భాజపా భావించిందేమో మితవాది కంభంపాటి హరిబాబునే అధ్యక్షుడుగా ఎంపిక చేయటం జరిగింది. అధ్యక్షపదవిపై తన ఆశలు సన్నగిల్లిన తర్వాత, తొలిసారిగా కర్నూలులో జరిగిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు తన సహజశైలిలో చంద్రబాబు ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన కాదు వ్యాపారం మాత్రమే జరుగుతున్నదని ఎద్దేవా చేశారు. మధ్యలో ఆయన విమర్శలు చంద్రబాబునాయుడు మీదనుంచి. అయితే అంతటితో ఆగకుండా ఆయన విమర్శనాస్త్రాలు కేంద్రమంత్రి సుజనా చౌదరి మీదకు మళ్లడం విశేషం. ప్రత్యేకించి సుజనా చౌదరి పేరును ప్రస్తావించకపోయినా, ఆ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యుడు అంటూ మాట్లాడడం సుజనా చౌదరి నే అన్నట్లు తెలుస్తోంది అని అంటున్నారు. ఆ రాజ్యసభ సభ్యుడు ఇవాళ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేతకు అవసరమైతే కాంగ్రెస్ తోనైనా పొత్తు పెట్టుకుని కేంద్రంలో చక్రం తిప్పగల సత్తా ఉందని అన్నారని , నిజానికి ఆ పార్టీ అధినేతకు అంతకు దిగజారుడు మామూలేనని వీర్రాజు విమర్శించారు. ఆ మాటలు మాట్లాడుతున్న ఆ రాజ్యసభ సభ్యుడికి అసలు ఆ పదవి ఎలా వచ్చింది, రూలింగ్ తోనా లేక ట్రేడింగ్ తో వచ్చిందా? అని అంటూ పరోక్షంగా డబ్బుతో పదవి కొనుక్కున్నారు అని అర్ధంవచ్చేలా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు రోజుల కిందట బిజెపి నాయకులు అమిత్ షాతో ఢిల్లీలో జరిగిన పార్టీ సీనియర్ నాయకుల సమావేశంలో తెలుగుదేశం పట్ల మెతకవైఖరితోనే వ్యవహరించాలని అదే సమయంలో రాష్ట్రం లో బిజెపి పార్టీని బలోపేతం చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆ సూచనలు ఎంతమేరకు నిజమో తెలియనప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వాన్ని, తెదేపా నాయకుల్ని సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఇరుకున పెడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు….