ఐపీఎల్ నుంచి కూడా అవుట్!

Thursday, March 29th, 2018, 03:14:57 AM IST

ఐపీఎల్ చరిత్రలో వార్నర్ – స్మిత్ ఎంతగా ఫెమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో వారికి చాలా మందికి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా వార్నర్ హైదరాబాద్ జట్టుకు 2016 ఐపీఎల్ ట్రోపిని అందించి మంచి కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక స్టీవెన్ స్మిత్ అంతర్జాతీయ జట్టులో సుస్థిర స్థానాన్ని దక్కించుకోవడానికి ఐపీఎల్ చాలా ఉపయోగపడింది. అంతే కాకుండా స్మిత్ ఆస్ట్రేలియా టీమ్ అతితక్కువ సమయంలో కెప్టెన్ గా ఎన్నికయ్యాడు. అయితే ఎంత గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఫైనల్ గా బాల్ టాంపరింగ్ వివాదంలో అటు దేశానికి ఇటు ఐపీఎల్ జట్లకు దూరమయ్యారు.

క్రికెట్ ఆస్ట్రేలియా వార్నర్ – స్మిత్ పై వేటు వేసిన మరుక్షణమే బిసిసిఐ కూడా తన నిర్ణయాన్ని తెలియజేసింది. ఏడాది వరకు వారు ఆటకు దూరంగా ఉండాలని, ఏడాది నిషేధం విధించడంతో ఐపీఎల్ నుంచి కూడా తప్పిస్తున్నట్లు.. బిసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరీ రీసెంట్ గా ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న వార్నర్ దూరమవుతుండడంతో ఆ జట్టుకు కొంచెం కష్టమే. రాజస్థాన్ పరిస్థితి కూడా అలానే ఉంది. స్టీవెన్ స్మిత్ ఒక్కడు ఉంటే చాలని అనుకున్నారు. ఇక వారిద్దరు ఈ ఏడాది దూరమవుతుండడంతో వారి స్థానంలో వేరే ఆటగాళ్లను తీసుకోవచ్చని బిసిసిఐ తెలిపింది.