వంగవీటి రాధా కు ఆ సీట్ కన్ఫర్మ్ అయిందా?

Monday, April 23rd, 2018, 09:47:19 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆశావహులు తాము పోటీ చేసే సీట్ల విషయమై జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టిడిపి ని ఈ సారి ఎలాగైనా ఓడించాలనే గట్టిపట్టుదలతో వున్నారు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి. సీట్ల కేటాయింపుల విషయంలో ఆయన ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుండి పోటీ చేసి ఓడిపోయిన వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ ఖరారైందని అంటున్నారు. ఈ నియోజకవర్గం టికెట్ కోసం వంగవీటి రాధా ఎంతో ఆశలు పెట్టుకొని, ఆ తరువాత జగన్ తీరు చూసి ఆ సీటు మీద ఆశలు వదులుకొని, ఏం చెయ్యాలా లని అనుచరులతో తర్జనభర్జనలు పడి, ఒకానొకదశలో పార్టీ మారేందుకు కూడా సిద్దపడ్డారు.

ఆ తరువాత జగన్ తొందర పడొద్దు న్యాయం చేస్తానన్న హామీతో సరే ఏం జరుగుతుంతో చూద్దామని వేచిచూస్తున్న తరుణంలో, రాష్ట్రంలో అనూహ్యంగా పరిణామాలు మారి, రాజకీయంగా టిడిపి ఎదురుదెబ్బలు తింటూండటం, పాదయాత్రలో జగన్ గ్రాఫ్ చాలా వరకు పెరిగినట్లు కనిపించడంతో మళ్లీ ఆలోచనలో పడిన వంగవీటి రాధాకు పవన్ కళ్యాణ్ అనూహ్య యుద్దం భలే కలిసొచ్చింది. ఎలాగంటే, గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం ప్రాబల్యంతో వంగవీటి రాధా, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారనే విమర్శ కొంతవరకు వుంది. అందుకే ఆయన ప్రస్తుతం త‌న‌కు విజయవాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కావాలని అడుగుతున్నారు. ఆ క్రమంలో ఒకటిన్నర సంవత్సరం ముందు విజయవాడ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బాధ్య‌త‌లు ఇచ్చారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ నేత మ‌ల్లాది విష్ణువ‌ర్థ‌న్ కూడా వైసీపీలో చేరిన తరువాత విజయవాడ వైసిపి గురించి జగన్ ఆలోచనలు మారినట్లు తెలుస్తోంది.

గత కొద్దికాలంనుండి రాధాకు జగన్ తో కొంత గ్యాప్ పెరిగిందని అంటున్నారు. దీంతో ఆ సీటు తనకు దక్కడం కష్టమేనని రాధా భావించడం, జగన్ కూడా రాధాకు సీటు ఇవ్వడం విషయమై కాకుండా న్యాయం చేసే విషయం గురించే మాట్లాడటం, ఆ తరువాత ఆ టికెట్ ను మల్లాదికి ఇచ్చేందుకు జగన్ మొగ్గు చూపి, రాధాకు ఆ తరువాత మంచి నామినేటెడ్ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ ఉన్నట్టుండి జనసేన అధినేత పవన్ ఇటు టిడిపి, అటు కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలపై ప్రకటించిన వార్ తో సీనంతా మారిపోయింది. జగన్ తాజా నిర్ణయం ప్రకారం మల్లాదికే నామినేటెడ్ పోస్టు, రాధాకి విజయవాడ సెంట్రల్ టికెట్ కన్ ఫామ్ అయిందనేది ఆ పార్టీ నేతల టాక్. నిన్నటిదాకా టిడిపికి కొంత, వైసిపి కొంత, జన సేనకు కొంత ఉన్న కాపు ఓటింగ్, ప్రస్తుతం పవన్ టిడిపి, ఆ పార్టీ మీడియా అంటూ కొన్ని మీడియా చానెల్స్పై యుద్దం ప్రకటించడంతో కాపు సామాజికవర్గంలో అత్యధికులు మనుగడ కోసం పోరాటం భావనతో ఏకమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ దశలో విజయవాడలో రాధాకు సీటు ఇవ్వకపోతే ఈ నియోజకవర్గంలోనే కాకుండా మిగిలిన చోట్ల కూడా కాపుల నుంచి వైసిపి తీవ్ర

వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంటుందని, పైగా రాధా వంగవీటి రంగా కుమారుడు కావడం, అదీగాక పవన్ వివాదం నేపథ్యంలో మళ్లీ ఖచ్చితంగా వంగవీటి రంగా పేరు తెరమీదకు రావడం జరుగుతుందనే ఆలోచనతో జగన్ వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు కన్ఫామ్ చేశారని అంటున్నారు. పైగా గత ఎన్నికల్లో కాపుల మూలంగా కొంతవరకు వారివోటు బ్యాంకు ను కోల్పోయిన జగన్, మరోసారి అదే దెబ్బ తినకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాపులకు ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా టిడిపి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని ప్రచారం జరుగుతుండటం, జన సేనకు సహజం గానే కాపుల దన్ను ఉంటుందని భావించడం, ఈ నేపథ్యంలో తాను వంగవీటి రాధాకు టికెట్ ఇవ్వనట్లయితే అది కాపుల్లో వేరే రకంగా సంకేతాలను పంపి మొత్తానికే దెబ్బ తీస్తుందనే ముందుచూపుతో, లాభం మాట అటుంచి నష్టం జరగకూడదనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకీ ప్రస్తుతం సీట్ కన్ఫర్మ్ అయిందని పలువురు విజయవాడకు చెందిన నేతలు అంటున్నప్పటికీ, దీనికి సంబంధిచి పార్టీ అధిష్టానం నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి వుంది…..

  •  
  •  
  •  
  •  

Comments