భవిష్యత్ తరాలను భయపెడుతున్న నీటి కొరత…ముందువరసలో ఏ దేశమంటే?

Friday, April 13th, 2018, 06:19:33 PM IST


ప్రస్తుత మానవుడు అవలంబిస్తున్న విధానాల వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడకి కొంత ముప్పు లేకపోలేదని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెప్పారు. మన మనుగడకు ముఖ్యమైనవి గాలి, నీరు. అయితే ఇప్పటికే ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడినట్లు, అదీకాక వాయుకాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంతో ఎండల తీవ్రత, పీల్చే గాలిలో దోషాల వల్ల భవిష్యత్తులో కొత్త వ్యాధులు వస్తాయని అంటున్నారు. అలానే మరొక ముఖ్యమైన అవసరం నీరు. రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలు తీవ్ర నీటికొరతతో అల్లల్లాడనున్నాయట. దీనికి ప్రధాన కారణం ఏటికేడు జలాశయాలు కుంచించుకుపోవటం అంటున్నారు.

అయితే ముఖ్యంగా భారత్‌, మొరాకో, ఇరాక్‌, స్పెయిన్‌ దేశాలు తీవ్రమైన నీటికొరతతో అల్లాడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తలెత్తిన పరిస్థితులే భవిష్యత్తులో పై నాలుగు దేశాల్లోనూ ఏర్పడనున్నట్లు వెల్లడించింది. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఈ దేశాల్లోనే ముందుగా కుళాయిలు ఎండిపోనున్నట్లు తెలిపింది. అమెరికా, డచ్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా రూపొందించిన సరికొత్త ‘ముందస్తు ఉపగ్రహ వ్యవస్థ నమూనా’ ప్రపంచంలోని ఐదు లక్షల జలాశయాలను విశ్లేషించిందని ప్రముఖ పత్రిక ‘ది గార్డియన్‌’ కథనం ప్రచురించినట్లు తెలుస్తోంది.

నర్మదా నది నీటి లభ్యతను బట్టి నిర్మించిన రెండు జలాశయాల పరిధిలో నీటికోసం ఆందోళనలు పెరిగాయని తెలిపింది. వార్షికసగటులో మూడోవంతు వర్షాలు మాత్రమే గత ఏడాది కురవడంతో, మధ్యప్రదేశ్‌లోని ఇందిరాసాగర్‌ ఆనకట్ట ఎగువన నీటి లభ్యత తగ్గింది. దీని ప్రభావం ఆనకట్ట దిగువన పడింది.ఫలితంగా మూడు కోట్ల మంది తాగునీటి కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఈసారి పంటలు పండించవద్దని, సాగును నిలిపివేయాలని గత నెల గుజరాత్‌ ప్రభుత్వం రైతులను కోరిన విషయం తెలిసిందే. అందువల్ల ఇప్పటినుండే అటువంటి దుర్భర పరిస్థితులు ఎదురుకాకుండా అందరం తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు……