ఏపీకి హోదా ఇస్తే, మాక్కూడా ఇవ్వాల్సిందే!

Tuesday, July 24th, 2018, 04:42:32 PM IST

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై జరుగుతున్న వివాదం, రోజు రోజుకు మరింతగా రాజుకుంటోంది. ఇప్పటికే హోదా విషయమై ఎన్డీయే నుండి బయటకు వచ్చిన టీడీపీ, ఇటీవల బిజేపిపై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశపెట్టింది. అయితే సరైన సభ్యుల మద్దతు లేక అది వీగిపోయియిందనే విషయం తెలిసిందే. ఇక నేడు హోదా కోసం ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి బంద్ కూడా చేపట్టింది. రాబోయే మరికొద్ది రోజుల్లో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం అంటున్నాయి వైసీపి శ్రేణులు. ఇక పోతే రాష్ట్రానికి సంజీవని వంటి హోదాని టీడీపీ మొదటి నుండి తొక్కి పట్టి ఇప్పుడు తమ స్వార్ధ ప్రయోజనాలకోసం ఎన్నికలు దగ్గర పడుతున్నాయని అడుగుతోందని, అంతా అయిపోయాక ఇప్పుడు పార్లమెంట్ లో గొంతు చించుకుని అరిచినప్పటికీ కూడా ఎటువంటి ఉపయోగం ఉండదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే ఈ అంశంపై నేడు తమ వైఖరి తెలిపిన తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమనడంలో తమకు ఎటువంటి అభ్యన్తరం లేదని, కొన్నాళ్ల నుండి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల విషయం తమకు కూడా తెలుసునని, కాకపోతే ఆంధ్రకు హోదా ఇస్తే మాకు కూడా ఇవ్వవలసిందే అని గట్టిగా స్పష్టం చేసారు. ఒకవేళ వారికి హోదా ఇచ్చినపక్షంలో పరిశ్రమలన్నీ కూడా ఆ రాష్ట్రానికి వెళ్ళిపోతాయని, ఇక అప్పుడు తెలంగాణ ప్రజలు కష్ట, నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందనే తాము కూడా హోదా ఇవ్వమని అడుగుతున్నట్లు తెలిపారు. ఇక ఇటీవల జరిగిన నేషనల్ కాంగ్రెస్ సిడబ్ల్యూసి సమావేశంలో జాతీయ అధ్యక్షులు రాహుల్ మరియు సోనియాలు మాట్లాడుతూ, తాము రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి హోదా తప్పనిసరిగా ఇస్తామని అంటున్నారు. అయితే ముందుగా ఆ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నిర్ణయమేంటో తెలపాలని ఆయన అన్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments