టిడిపి విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 18న నిరసన : సిపిఐ రామకృష్ణ

Friday, June 1st, 2018, 01:19:33 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాటల దాడి చేసారు. మొన్న జరిగిన మహానాడులో ప్రజలు రాకపోయినా, వేలమంది వస్తున్నారని టీపీడీ నేతలు డబ్బాలు కొడుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు తాను కాబోయే ప్రధానమంత్రి అని అందరితో అనిపించుకోవాలని అక్కడికి వచ్చిన నేతలతో పొగిడించుకోవడంతప్ప మహానాడులో ఒరిగిందేమి లేదని మండిపడ్డారు. ఇక అక్కడ ముఖ్యంగా భోజనాలు మాత్రమే బాగా పెట్టారని, అందుకు మహానాడు బాగా జరిపారని చెప్పుకోవచ్చని ఛలోక్తులు విసిరారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్ని దీనావస్థలు పడుతున్నా టిడిపి వారికీ అవసరం లేదని, తమకు కావలసిన నేతల బంధువులకు మాత్రం ఎన్నో చేస్తున్న ఈ ప్రభుత్వం, పేద మధ్యతరహా వారిని పూర్తిగా విస్మరించిందని అన్నారు. మహానాడులో కేవలం ధనికులకు పెద్దపీట వేశారు, మిగిలినవారిని అసలు పట్టించుకోలేదని అన్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు ఏకంగా 20లక్షల ఇల్లు కట్టించి ఇస్తామన్న బాబు మొత్తం ఈ 13 జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక్క ఎకరా ప్రజలకు భూ పంపిణీ చేసింది లేదని అన్నారు.

ఇప్పటికే ఇక్కడి యువత ఎన్నాళ్ళనుండో నిరుద్యోగ సమస్యతో నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారి ప్రభుత్వ కాలం ముగిసే సమయానికి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తాం అనడం విడ్డూరమన్నారు. అదీకాక కేవలం డిగ్రీ మరియు డిప్లొమా చేసిన వారికీ మాత్రమే ఇస్తామని చెప్తున్నారని, అదికూడా కేవలం రూ.1000 ఇవ్వడం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం ఉండదని, నెలకు రూ.3600 ఇవ్వాలని డిమాండ్ చేసారు. అలానే పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి కూడా భృతిని అమలు చేయాలనీ, ఈ విషయంలో కేవలం పది లక్షలమంది మాత్రమే ఇస్తాం అని పక్కాగా పట్టుపట్టడం సరైనది కాదని అన్నారు.ఈ విధంగా టీడీపీ, అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 18న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఐ కార్యదర్శి రామ కృష్ణ అన్నారు. దీని ద్వారా అయినా టీడీపీ నేతలకు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు…….