చంద్రబాబుని తక్కువ అంచనా వేయలేం : బిజెపి జాతీయ కార్యదర్శి

Tuesday, June 12th, 2018, 02:43:00 PM IST

గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ విషయంలో చెప్పినవి చెప్పినట్లుగా దాదాపుగా అన్ని హామీలు కేంద్ర ఎన్డీయేలోని మా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. నేడు విజయవాడలోని బిజెపి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అంత తక్కువగా అంచనా వేయలేమని, అలానే టీపీడీ వ్యూహాత్మక అడుగులో భాగమే ఎన్డీయే నుండి బయటకు రావడమని అన్నారు. కేంద్రప్రభుత్వం నుండి నిధులను తెలివిగా రాబట్టిన బాబు, వాటికి తమ పేర్లు పెట్టుకుని రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారని, అంతేకాక మొదట హోదా విషయమై ఒప్పుకుని ఆ తరువాత ప్రత్యేక ప్యాకెజీకి ఒప్పుకోవడంకూడా అయన తెలివికి నిదర్శనమని చమత్కరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికి చంద్రబాబు మాత్రం ఆ పరిస్థితులకు తగ్గట్లు వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం ఏపీలో వున్న పరిస్థితులను బట్టి చూస్తే టిడిపి ఓటమి ఖాయమని చెప్పలేమని, పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయి చెప్పలేమని అన్నారు.

చంద్రబాబు తరహా రాజకీయ నాయకుడికి మోడీ, అమిత్ షా వంటి వారిని సైతం ప్రభావితం చేయగల సామర్థ్యం వుందని అన్నారు. ఎన్టీఆర్ మరణాంతరం బాబు టీపీడీ కార్యకర్తలు, నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీని నడిపిన విధానం చూస్తే అది అర్ధమవుతుందని అయన స్పష్టం చేశారు. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షం వైసిపిని, అలానే నూతనంగా వచ్చిన జనసేన పార్టీని ఎలా ఎదుర్కొనాలనే వ్యూహం ఆయనకు తప్పక వుండి ఉంటుందని అన్నారు. నిజానికి ప్రస్తుతం ఆంధ్రలో జనసేన పార్టీ అధికారం లోకి వస్తుందా లేదా అనేది స్పష్టంగా చెప్పలేమని, అయితే చిరంజీవి పార్టీపెట్టిన సమయంలో వున్న పరిస్థితులు నేడు లేవు కనుక ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదని చెప్పారు. కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికలకై బిజెపి ఇప్పటినుండి ఏపీఫై దృష్టిపెట్టిందని, ఎన్ని దుష్టశక్తులు తమకు ఎదురువచ్చినా ప్రజల అభిమానం, ఆదరణ తప్పక చూరగొంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు…..

  •  
  •  
  •  
  •  

Comments