వాళ్ళని నమ్ముకుంటే బెల్లం ముక్క కూడా దక్కదు : జేసి

Wednesday, July 11th, 2018, 04:14:40 PM IST

అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తన పదునైన వ్యాఖ్యలతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. ఏదైనా సరే వున్న విషయాన్నీ వున్నది ఉన్నట్లుగా మొహం మీదే చెప్పడం తనకు అలవాటని ఆయన అంటుంటారు. నిన్న కమ్యూనిస్టు నాయకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అయన, నేడు ఆయన మరొకసారి బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతే కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేసారు కూడా. మొదట్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకునపుడే ఏపీకి వీరు ఏ మాత్రం న్యాయం చేస్తారా అని అనుమానం వచ్చిందని అన్నారు. మోడీకి ప్రధాని అవ్వాలన్న కాంక్ష తప్ప వాస్తవంలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్న ఉత్సుకత అస్సలు లేదన్నారు. మనకు ప్రత్యేక హోదా ఇవ్వడం వారికి చాలా చిన్న విషయం అయినప్పటికీ కూడా మనల్ని ముప్పతిప్పలు పెడుతున్నారని అన్నారు.

అదేదో ఇదివరకు ఎవ్వరికీ హోద కట్టబెట్టనట్లు ఎందుకు అంతలా కేంద్రం వారు ఆలోచిస్తున్నారో తనకు తెలియడం లేదన్నారు. మనం ఎన్ని దీక్షలు చేసినా, ఎంత పొరుకాడినా ఇక ప్రత్యేక హోదా రాదని అన్నారు. అసలు కేంద్ర బీజేపీ నాయకుల మనస్సులో ఆ ఆలోచనే ఉంటే ఇప్పటివరకు రానివ్వరు కదా, ఇంత రాద్ధాంతం ఎందుకు జరుగుతుందని అన్నారు. వారిని నమ్ముకుంటే మన రాష్ట్రానికి కనీసం బెల్లం ముక్క కూడా దక్కదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సీఎం రమేష్, చంద్రబాబు వంటివారు ఎన్ని దీక్షలు చేసినా అవి వృధా ప్రయాసలె తప్ప వారికీ కనువిప్పు కలుగదు అని విమర్శించారు. ఇక వెంకయ్య నాయుడు మన దేశానికి ఉప రాష్ట్రపతిగా ఉండడం మన ఖర్మ అని, ఆయన వల్ల మన రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని అన్నారు. ఏపీ బిజెపి నేతలు మాత్రం మనకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరచకుండా చూస్తూ ఊరుకోమంటున్నారు, ఇది ఎంతవరకు మీకు నయమయ్యా అంటూ ప్రశ్నించారు.

చంద్రబాబు అతి మంచితనం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయని, రాష్ట్రానికి మంచి చేయాలనే తపన వున్న ప్రస్తుత నాయకుల్లో చంద్రబాబు అగ్రపథాన నిలుస్తారని అన్నారు. ఆయన మరొక ముప్పై ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగానే కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినప్పటికీ చూస్తాం చేస్తాం అని మాట దాట వేస్తున్న కేంద్రం వారిని బాబు కాబట్టి ఆగ్రహించకుండా వదిలేశారని, అదే మరొకరైతే వేరేలా ఉండేదని అన్నారు. బాబు గారు మీకు మరీ అంత సౌమ్యత్వం పనికి రాదూ, అందరూ కూడా మనవాళ్లే అనుకోవడం తప్పు, కాస్త అది ఆలోచించండి అంటూ హితవు పలికారు. కాగా జెసి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి……

  •  
  •  
  •  
  •  

Comments