సమంతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు : మంత్రి కేటీఆర్

Tuesday, March 27th, 2018, 06:05:11 PM IST

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, అలానే ఆయన తనయుడు ఐటీ, మరియు పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తమ వంతుగా అన్ని విధాలా అద్భుత పథకాలతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇప్పటికే మరీ ముఖ్యంగా వ్యవసాయానికి విద్యుత్తు, అలానే రైతులకు భీమా వంటి పధకాలు ఆయన్ను పేదవాడికి మరింత చేరువ చేశాయని చెప్పొచ్చు. తమ రాష్ట్రం లో వ్యవసాయాన్ని పెద్దపీట వేస్తామని కేసీఆర్ పలు మార్లు తెలిపారు. అలానే ఆతర్వాత చేనేత రంగాన్ని కూడా తమవంతు ఆదుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం కీలకంగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

శాసనమండలిలో మంగళవారం చేనేత రుణాలు, హ్యాండ్లూమ్ రంగానికి సహాయం అనే అంశంపై చర్చ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ చేనేత కార్మికులు ఉన్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో చేనేత పనిచేస్తున్న వారి లెక్కలే లేవని, తమది చేనేతల, చేతల సర్కారని స్పష్టం చేశారు. 2002లో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని, 2007లో సిరిసిల్లలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో ఉన్న మగ్గాలకు జియో ట్యాగ్‌ చేశామని వెల్లడించారు. చేనేత రుణమాఫీని ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది సూరత్ నుంచి వచ్చిన చీరల్లో కొన్ని నాసిరకం వచ్చాయని, అందువల్ల ఈ సారి బతుకమ్మ చీరలు సిరిసిల్లలోనే తయారు చేస్తున్నామన్నారు.

చేనేత రంగానికి కేంద్రం నుంచి సహకారం లేనప్పటికీ రాష్ట్రప్రభుత్వం తగు సాయం అందిస్తుందని తెలిపారు. మరో వైపు చేనేత బ్రాండ్ అంబాసిడార్‌గా సినీ నటి సమంత ఉచితంగానే వ్యవహరిస్తున్నారని, ఆమెకు తెలంగాణ సర్కారు ఒక్క రుపాయి కూడా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని, తమది ప్రజా ప్రభుత్వమని, చేనేత రంగాన్ని ఆదుకునేందుకు అన్నివిధాలా చెర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్‌ అన్నారు….