శ్రీరెడ్డి కి మా పార్టీతో సంబంధం లేదు : వైసిపి నేత అంబటి

Thursday, April 19th, 2018, 11:00:11 PM IST

ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ విషయంలో శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి కొన్ని వర్గాల నుండి మద్దతు వస్తున్నప్పటికీ, కొందరు మాత్రం ఆమె వ్యవహరించే తీరు తప్పు పడుతున్నారు. ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ కోసం, అలానే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల కోసం ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలనుకున్నవారు కూడా అనూహ్యంగా ఆమె జనసేన అధినేత పవన్ పై అసభ్య పదజాలంతో దూషించడం పై మండిపడుతున్నారు. అలానే ఇప్పటికే ఇదివరకు మేము శ్రీరెడ్డికి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ఓయు జేఏసీ నాయకులు తెలిపారు. అది వర్మ వల్ల చేసానని, ఆయన అలా చెప్పించారని ఆమె కారెక్టర్ ఆర్టిస్ట్ తమన్నా తో చెప్పిన ఆడియో సంభాషణ బయటకు వచ్చింది.

అయితే తనను ఇరికించడానికి వైసీపీ నేతలు పెద్ద ప్లాన్ వేశారని, పోరాటం చేస్తున్న తనను వాడుకోవాలని ప్రయత్నించారంటూ శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిిసందే. ఈ ఆరోపణలు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. నేడు ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి వెనుకో, లేక మరోరెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, ఏదైనా మాట్లాడదలచుకుంటే సూటిగా, ఘాటుగా మేమే మాట్లాడతాము తప్ప, ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు. తమకు కానీ తమపార్టీకి కాని అంతనీచమైన పరిస్థితిపట్టలేదని, ఎవరో కావాలనే తమ పార్టీ కి ప్రజల్లో వున్న పేరుని చెడగొట్టాలని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు….