తమ పార్టీని ఏ పార్టీలోను విలీనం చేయమన్న చంద్రబాబు!

Thursday, March 1st, 2018, 03:10:53 PM IST

తెలంగాణలో టిడిపి పని అయిపోయిందని, ఇప్పట్లో పార్టీ బలపడే అవకాశమే లేదని, వున్న కొంతమంది నేతలు కూడా టిఆర్ఎస్, కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, కావున చంద్రబాబు పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేయాలని అప్పట్లో టిటిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. అయితే తెదేపాను ఏ పార్టీలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదని, ఆసలు అలా చెప్పే హక్కు ఎవరికీ లేదు అని చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. బుధవారం ఎన్టీఆర్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

తెలంగాణలో రాజకీయ అవసరాల దృష్ట్యా ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటుందని, ఇక్కడ తెదేపా బలం పుంజుకుంటే అందరూ మనవైపే వస్తారు అని తెలంగాణ టిడిపి పరిస్థితి పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ లేదా బ్రహ్మణి, బాలకృష్ణలకు తెలంగాణ నాయకత్వ బాధ్యతలివ్వాలని కొందరు కార్యకర్తలు మాట్లాడుతూ కోరగా చంద్రబాబు నవ్వుతూ కార్యకర్తల్లో ఆవేదన, ఆవేశం ఉన్నప్పుడు ఇలా అడగటం సహజమన్నారు. మా కుటుంబం నుంచి ఇక్కడి రాజకీయాల్లోకి ఎవరూ రారని అన్నారు.

ఇక్కడి నేతలే రాష్ట్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలి అని ఆయన సూచించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎన్టీఆర్‌భవన్‌కు వచ్చిన ఆయన తొలుత పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను నేతలు ఆయనకు వివరించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులకన్నా, కార్యకర్తలే చాలా హుషారుగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో రైతుకు ప్రమాదబీమా కింద రూ.5 లక్షల పథకాన్ని తెస్తున్నట్లు టిఆర్ఎస్ చేసిన ప్రకటనను నేతలు అడగ్గా, ఏపీలో ఎప్పటి నుంచో చంద్రన్న బీమాను అమలుచేస్తున్నామని వివరించారు.

అసలు టిడిపితో పొత్తు ఉండదనే విధంగా బిజెపి నేతలే వ్యాఖ్యానిస్తున్నారని, వారు మిత్రధర్మం పాటించడం లేదన్నారు. టిఆర్ఎస్ లో విలీనం చేస్తే తొలుత ఆత్మహత్య చేసుకునేది తానేనని సుధాకర్‌ అనే కార్యకర్త ఆవేశంతో మాట్లాడగా, దానికి చంద్రబాబు స్పందిస్తూ పార్టీని విలీనం చేస్తానని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. పార్టీ కోసం పోరాడేవారికి అండగా ఉంటానని, తెరాస ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా భయపడవద్దన్నారు గతంలో పాత మూడు జిల్లాల్లో పర్యటించారని, మిగిలిన ఏడు పాత జిల్లాల్లో పర్యటిస్తే పార్టీకి ఊపు వస్తుందని చంద్రబాబును రాష్ట్ర నేతలు సైతం కోరారు.

అయితే త్వరలో పార్టీ ప్రతిస్తతను పెంచేలా తగు నిర్ణయం తీసుకుంటామని, ఆదిశగా అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నట్లు కార్యకర్తలకు బాబు వివరించారు. రాజకీయాల్లోకి వచ్చి 40 ఏళ్లు పూర్తయినందుకు ఆయనను రాష్ట్ర నేతలు ఘనంగా సన్మానించారు.