మాకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు : విజయసాయి రెడ్డి

Tuesday, May 15th, 2018, 05:35:16 PM IST

ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో తన యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఆయన చేపట్టిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎన్నడూలేనంతగా ప్రజా సైన్యం జగన్ వెంట తరలివస్తున్నారని వైసిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జగన్ ప్రజాసంకల్ప యాత్రకు మద్దతుగా ఎంపీ విజయ్ సాయి రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, కుట్రలు కుతంత్రాలతో నిండిపోయిన టీడీపీ ప్రభుత్వ పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటికూడా నెరవేర్చలేదని అన్నారు. టీడీపీ నేతలకు ప్రజా సంక్షేమం కంటే ప్రతిపక్షాలపై విమర్శలు చేయడమే ముఖ్యం అయిపోయిందని, ఆ విధంగా మాపై ఆరోపణలు చేస్తేగాని వారికి తెల్లారదన్నారు.

ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్న జగన్ ను రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని, జగన్ ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం, ప్రజల అభ్యున్నతికోసమే తన రాజకీయ జీవితాన్ని నడిపిస్తున్నారని అన్నారు. తమకు ఇతర పార్టీలవలె జాతీయ రాజకీయాలపట్ల ఎటువంటి ఆసక్తి లేదని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని రాష్ట్ర అభివృద్ధి కోసమే జగన్ సహా తమ పార్టీ నేతలందరూ తపన పడుతున్నారని అన్నారు. ఇప్పటికే చంద్రబాబు హోదా పేరుతో, విభజన హామీల పేరుతో కేంద్రం నుండి స్వాహా చేసిన నిధుల పై తాము ప్రశ్నిస్తుంటే, ఎక్కడ తమ తప్పులు బయటపడతాయోనని భయంతో ధర్మ పోరాట దీక్ష పేరుతో ప్రత్యేక హోదా సాధన నెపంతో ఒక మోసపూరిత దీక్ష చేసిన విషయం అందరికి తెలిసిందే అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్న టిడిపి నేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఈ సారి ఓటు ఆయుధంతో వారికి గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని మండిపడ్డారు……..

  •  
  •  
  •  
  •  

Comments