ఇలాంటి దీక్షలు మరొక 12 నిర్వహిస్తాం : చంద్రబాబు

Wednesday, May 2nd, 2018, 12:55:26 PM IST

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో విభజన ఫలాలు, హోదా విషయమై మోసం చేసిన కేంద్ర బీజేపీ పార్టీ పై నిరసనగా చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ప్రజల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఆయన చేపట్టిన దీక్ష దొంగ దీక్ష, మరియు మోసపూరితమైనదని ప్రతిపక్ష వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ వంచన దీక్ష చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయమై నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, జగన్ పార్టీ నా దీక్ష మోసపూరితమైనదని వంచన దీక్ష అనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు.

జగన్, బిజెపితో రహస్య పొత్తు పెట్టుకుని తనపై కేసుల నుండి తప్పించుకునేలా కుట్రలు పన్నుతున్నారని, ఇదంతా మోడీ కనుసన్నల్లో జరుగుతుందని అన్నారు. ఒకప్పుడు ఏపీకి ఎంతో చేస్తామని, తమ వంతు సాయం అందిస్తామని చెప్పి ఏమాత్రం సాయం చేయకుండా వదిలివేశారని మండిపడ్డారు. ఇటీవల చేపట్టిన ధర్మపోరాట దీక్ష మాదిరి దీక్షలు మరొక 12 రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు.

అందులో రెండవ దీక్ష విశాఖపట్నం లోను, ఆఖరిది ఆంధ్ర రాజధాని ప్రాంతమయిన అమరావతి లోను నిర్వహిస్తామని అన్నారు. ఎవరెన్ని కుట్ర దీక్షలు చేసినా ప్రజల మద్దతు తమకే ఉందని, న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే ఏపీ ప్రజలు వైసిపి, బీజేపీల మోసాలను గుర్తించారని, రానున్న ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్పనున్నారని అన్నారు……