మావంతు ఉడత సాయం చేస్తాం: జేపీ

Tuesday, February 13th, 2018, 03:50:39 AM IST

ఎన్డీయే ప్రభుత్వంలో ప్రవేశబెట్టబోయే ఈ సారి బడ్జెట్ ఆఖరిది కావడంతో ఏపీ అభివృద్ధి పై వరాల జల్లు కరుస్తుందని ఆశించిన రాష్ట్ర నేతలకు, ప్రజలకు కేంద్రం తీవ్ర నిరాశే మిగిల్చింది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సరైన న్యాయం జరగలేదని, ఏపీకి నిధులు ఇస్తున్నామని కేంద్రం మోసం చేస్తోందని కేంద్ర బిజెపికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఒక రోజు రోజు బంద్ కూడా పాటించాయి. రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం ఏపీ కి అన్ని రాష్ట్రాల కంటే ఇప్పటివరకు చాలా చేశామని ఎంపీ హరి బాబు లెక్కలు చూపిన సంగతి విదితమే.

అయితే దానికి టిడిపి నేతలు స్పందిస్తూ అవి లెక్కలు మాత్రమేనని, కేంద్రం ఇప్పటివరకు చేసిన సాయం చాలా తక్కువని వారు వాదిస్తున్నారు. అయితే ఇపుడు ఇదే అంశమై కేంద్రం విడుదల చేసిన నిధులు లెక్కలకు, టిడిపి చెపుతున్న లెక్కలకు పొంతన లేదని ఎవరిది నిజమో ఎవరిది అబద్దమో చెప్పలేక అంతా గందరగోళంగా ఉందని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ అంశంలో నిజా నిజాలు తేల్చేందుకు ఆయన ఒక నిజ నిర్ధారణ కమిటీ ని కాంగ్రెస్ మాజీ నేత ఉండవల్లి, లోక్సత్తా అధ్యక్షులు జెపి తో కలిసి ఏర్పాటు చేస్తామని, ఈ నెల 15 లోపు తమకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తమ లెక్కల నివేదికలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై ఆయన ఉండవల్లి ని, జెపిని కలిశారు కూడా. అయితే ఈ సందర్భంగా నేడు జెపి ని కలిసిన ఉండవల్లి ఈ అంశంపై మాట్లాడుతూ ఇది కేవలం ప్రారంభమేనని, రెండు మూడు రోజుల్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం నుండి నివేదికలు రాగానే కమిటీ లో చర్చించి అసలు ఎవరు చెప్పింది నిజమో తేల్చవచ్చని అన్నారు.

నిజానికి వారి నుండి నివేదికలు రావడంకంటే ముందే జెపి గారి దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయని అన్నారు. జెపి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా నలుగుతున్న ఈ అంశం పై ఇప్పుడే మాట్లాడలేమని నిజా నిజాలు తేల్చడానికి కొంత సమయం పడుతుందని, అందుకు తమ వంతు ఉడత సాయం అందిస్తామని అన్నారు. సీపీఐ రామ కృష్ణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఈ కార్యం వల్ల ఎవరిది తప్పో తేలుతుందని, అయినా ప్రత్యేక హోదా నిధులు హక్కు ద్వారా సంక్రమిస్తాయని, అదే ప్రత్యేక ప్యాకేజీ అయితే ఇలా కేంద్రాన్ని అర్ధించవలసి ఉంటుందని, త్వరలో అన్ని పార్టీ లను కలుపుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొక్కి పట్టిన ప్రత్యేక హోదాను సాధించే దిశగా ముందుకు సాగుతామని అన్నారు…..