2019లో మాకు 60 నుండి 70 సీట్లు ఖాయం : ఉత్తమ్ కుమార్ రెడ్డి

Friday, June 1st, 2018, 04:42:24 AM IST

రానున్న 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఓ వైపు ఏపీలో మూడు ప్రధాన పార్టీల అధినేతలయిన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లు తమదైన రీతిలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణాలో కూడా టీఆర్ఎస్ నేతలు ఇటీవల ప్లీనరీ నిర్వహించి కార్యకర్తల్లో, నేతల్లో మంచి జోష్ నింపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి టిటిడిపి సీనియర్లు కాంగ్రెస్ లో చేరడం ఆ పార్టీకి కొంతమేర బలాన్ని చేకూర్చినట్లయిందని చెప్పాలి. అలానే మొదటినుండి గ్రూప్ రాజీకీయాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీ నేతలు రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై , అలానే పార్టీ కార్యకలాపాలపరి దృష్టిపెట్టి అందరిని కలుపుకు పోతారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. నేడు అయన మాట్లాడుతూ, ఇప్పటికే బూత్ లెవెల్ నుండి రాష్త్ర స్థాయి వరకు వున్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ప్రజల్లో మమేకమై ప్రస్తుత అధికార పార్టీ అయిన టిఆర్ఎస్ రాష్ట్ర పాలనలో ఏవిధంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు.

నిజానికి అప్పట్లో తెలంగాణ తెచ్చింది, ఇచ్చింది మేమె అని ప్రజలకు పూర్తిగా వివరించడంలో కొంత తడపడ్డామని, దానివల్ల టిఆర్ఎస్ కు చాలా వరకు మేలు జరిగిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా పోయింది ఏమిలేదని, అవసరమయితే ఇతర పార్టీల మద్దతు కూడగట్టి అయినా సరే టిఆర్ఎస్ ను తప్పక ఓడించే ప్రయత్నం చేస్తామని ఆయన అన్నారు. అంతే కాదు గత ఎన్నికలతో పోలుచుకుంటే ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభావం చాలావరకు తగ్గిందని, ప్రజలు కేసీఆర్ నియంతృవ విధానాలు, ఆయన కుటుంబ దోపిడీపై పూర్తిగా విసుగు చెందివున్నారని, అందువల్ల రానున్న ఎన్నికల్లో తమకు వున్న సమాచారం మేరకు 60 నుండి 70 సెట్లవరకు గెలవగలమనే అంచనా వేస్తున్నామని, ఇకపోతే టిఆర్ఎస్ కు 40 సెట్లవరకు రావొచ్చని చెప్పారు. పార్టీలో సీనియర్లు అలానే కొత్తవారు అందరూ కలిసి ప్రజా సంక్షేమం కోసం పని చేస్తే విజయం మమ్ములను తప్పక వరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు………