కర్ణాటకలో బిజెపి గెలుపుపై అమితాషా ఏమన్నారంటే!

Tuesday, May 15th, 2018, 10:47:48 PM IST

కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలలో బిజెపి 104 స్థానాలను కైవశం చేసుకుంది. తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ 78, జేడీఎస్ 37 అలానే ఇతరులు 3 స్థానాలతో సరిపెట్టుకున్నారు. కాగా ఈ విజయం ప్రజా విజయమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఆయన బిజెపి ప్రధాన కార్యాలయంలో నేడు మాట్లాడారు. ఒక దానివెంట మరొకటి ఇలా విజయపరంపర కొనసాగిస్తున్నందుకు దేశంలో తమ పార్టీ ప్రాభవం రోజురోజుకు పెరుగుతోంది అన్నారు. మోడీ నేతృత్వంలో ప్రజలు సుభిక్షంగా వున్నారని, భవిష్యత్తులో కూడా మరిన్ని రాష్ట్రాల్లో తమనే విజయం వరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కర్ణాటకలో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి యెడ్యూరప్ప కృషి మరువలేనిదని, అలానే తాము చేపట్టిన ప్రజా సంక్షేమ యాత్రలు కూడా మంచి ఫలితాలనిచ్చాయన్నారు.

కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో, ఒకచోట ఓటమిపాలు కావటం, అలానే గెలిచిన చోట కూడా అత్యల్ప మెజారిటీతో గెలవడం వారి పట్ల ప్రజలకు పెద్దగా నమ్మకం లేకపోవడానికి నిదర్శనమన్నారు. నిజానికి కాంగ్రెస్ నేతృత్వంలోని మంత్రుల్లో చాలామంది ఘోరంగా ఓటమిపాలయ్యారని అన్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహిత రాష్ట్రంగా చూపడంలో అక్కడి ప్రజలు చేసిన ప్రయత్నం, చొరవ ఎనలేనివాని కొనియాడారు. చంద్రబాబు వంటి నాయకులూ తమపార్టీకి వోటెయ్యొద్దని ఇక్కడి తెలుగువారిని ఉద్దేశించిన వ్యాఖ్యలకు ఇక్కడి ప్రజలు ధీటైన జవాబిచ్చారు అన్నారు. ఈ విజయం ప్రజావిజయమని, మా విజయం ప్రజలకు అంకితమన్నారు….

Comments