బిజెపి నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటున్న ఎంపీ!

Thursday, June 14th, 2018, 10:53:54 PM IST


ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ వ్యూహాత్మకంగా ముందుకు నడుస్తున్నాయి. ఒకవైపు అధికార టీడీపీ కేంద్రం ఏపీకి హోదా, విభజన హామీల విషయమై సాయం అందివ్వకుండా మోసం చేసిందని చెపుతోంది. మరో వైపు బిజెపి నేతలు మాత్రం మేము గత ఎన్నికల సమయంలో చెప్పినవన్నీ దాదాపుగా నేరవేర్చామని అంటున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయమై ఇటీవల టీడీపీ ఎన్డీయే నుండి బయటకు వచ్చింది. ఇక ఆ తరువాత రెండు పార్టీల నేతల మధ్య మాటల దాడి మరింత పెరిగింది. నిన్న బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కేంద్రానికి సమర్పించిన లేఖలో అసలు కొన్ని అంశాల ప్రస్తావనే లేదని చంద్రబాబు అంటుంటే మరోవైపు నేడు అదే విషయమై గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా మండి పడ్డారు. బిజెపి నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని 2014లోనే కడపలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పడం సాధ్యంకాదని సెయిల్ నివేదిక ఇచ్చిందని అన్నారు.

కాగా నిన్న సెయిల్ నివేదికను కేంద్రం సుప్రీమ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించింది, అయినా స్టీల్ ధరల్లో అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందని అన్నారు. అసలు కేంద్రానికి అక్కడ నిజంగా స్టీల్ కర్మాగారం నెలకొల్పాలనే చిత్తశుద్ధి ఉంటే అప్పటి నివేదిక ఇప్పుడెందుకు సమర్పిస్తారని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారు అన్నారు. అలానే కన్నా సమర్పించిన 12 అంశాల నివేదికలో స్టీల్ ప్లాంట్ అంశం ఉందని, ఇక ఆయన సమర్పించిన ఆ లేఖలో కాపు రిజర్వేషన్లు, హోదా అంశం లేనేలేదని అన్నారు. కావున ఇకనైనా బీజేపీ నేతలు నిజాలు మాట్లాడాలని, ఏపీ ప్రజలను ఎన్నాళ్ళో ఇలా అబద్దాలు చెప్పి మభ్యపెట్టలేరని, వారు అంతా చూస్తున్నారు, వారికి అంతా తెలుసు. సమయం వచ్చినపుడు వారే తమ ఓటుతో బీజేపీకి సరైన బుద్ధి చెపుతారని విమర్శించారు……

  •  
  •  
  •  
  •  

Comments