విదేశాలకు వెళ్లి బాబు ఏంచేస్తారో అర్ధం కాదు : వైఎస్ జగన్

Sunday, April 1st, 2018, 09:12:48 AM IST

ప్రస్తుతం ప్రజాసంకల్ప యాత్రలో భాగం గా వైఎస్సార్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లా లో పర్యటిస్తున్నారు. అయితే అందులో భాగంగా అధికార టీడీపీ ప్రభుత్వం పై అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు పై భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న గుంటూరు జిల్లా పేరేచెర్ల సభలో ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజధాని నిర్మాణం కోసం ఎన్నో డిజైన్ లను పరిశీలించడం మీద వున్న శ్రద్ధ, అసలు ఆ రాజధాని నిర్మాణానికి కావలసిన నిధుల విషయంలో లేదని, అయినా నిధులు స్వాహా చేయడానికి ఆయన ఇలాంటి కుయుక్తులు ఎన్నో పన్నారని విమర్శించారు.

అసలు చంద్రబాబు చేసిన తప్పులకు విదేశాల్లోఅయితే జైలులో పెడతారని అన్నారు. నాలుగు సంవత్సరాలు ఒక్క బిల్డింగ్ కట్టడానికి సరిపోలేదా అంటూ ఎద్దేవా చేశారు. పోనీ ఎవరైనా బాబును ప్రశ్నిస్తే వారిని రాజధాని నిర్మాణానికి అభివృద్ధికి వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ ఎదురుదాడి చేస్తున్నారని చెప్పారు. ఈ నాలుగేళ్లుగా చంద్రబాబు చేయని మాయ, మోసం, చెప్పని అబద్ధం లేదని విమర్శించారు. అసలు రాజధాని కట్టే ఉద్దేశం చంద్రబాబుకి ఉందా, లేదా, లేకపోతే రాజధాని పేరు చెప్పి చంద్రబాబు విదేశీ టూర్లేస్తూ గడిపేస్తారా అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని, రాజధాని పేరుతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని వ్యాఖ్యానించిన జగన్ బాబు చూపే నమూనాలపై ఒక వాడి విమర్శ చేశారు.

చంద్ర బాబు రిలాక్స్ అయినపుడు సిస్టమ్ ముందు కూర్చుని ఇంటర్నెట్ ఓపెన్ చేస్తారు. అపుడు గూగుల్ ఇమేజ్ లో బెస్ట్ బిల్డింగ్స్ అని సెర్చ్ చేస్తారు. ఏదైనా అద్భుతమైన బిల్డింగ్ ఫొటో కనపడితే దానిని వెంటనే డౌన్ లోడ్ చేసి తర్వాత ఆ ఫొటోను పత్రికల్లో వేయించుకుని ఇదిగో ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్ రూపకల్పన చేసిన రాజధాని నమూనా అంటూ ప్రజల అభిప్రాయం తీసుకుని ఫైనల్ చేస్తాం అంటారు, ఇదే ఆయన చేసే అసలు పని అన్నారు. అంతే ఒక ఐదారు నెలలు గడిపేసి ఆ తర్వాత మరొక కొత్త బొమ్మ డౌన్ లోడ్ చేస్తారు అంటూ మాటల తూటాలు పేల్చారు జగన్. ఇప్పటికే ఓ సారి జపాన్, అమెరికా, టర్కీ పలుమార్లు సింగపూర్ వెళ్లొచ్చారని మరి అక్కడకు వెళ్లి ఆయన ఏం చేస్తుంటారో అర్థం కావడం లేదన్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం బాగుండాలని ఆలోచిస్తారని కానీ చంద్రబాబు మాత్రం తన బినామీలు బాగుంటే చాలనుకుంరడన్నారు. ఇప్పటికైనా బాబు చేసిన తప్పులకు బుద్ధి తెచ్చుకుని నిజాలు మాట్లాడితే బాగుంటుంది అన్నారు….