పవన్ తో కలిసి ఆ నేత ఏమి చర్చించారు?

Friday, February 23rd, 2018, 03:44:01 AM IST


జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విభజన హామీలు, రాజధానికి కేంద్రం చేసిన అన్యాయం పై తనదైన రీతిలో పోరాడేందుకు ముందుకు సాగుతున్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశం తోనే అప్పట్లో కేంద్ర బిజెపికి, రాష్ట్ర టిడిపి ప్రభుత్వాలకి మద్దతిచ్చానని అన్నారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తుంటే రాష్ట్రాభివృద్ధికి మరింత లాభం చేకూరుతుందన్న చంద్రబాబు మాటలతో ఏకీభవించానని, ఈ విషయమై రాష్ట్రానికి ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల తరపున రెండు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు తనకి ఉందని అన్నారు.

ఆయన నెలకొల్పిన జేఎఫ్సి నిజ నిర్ధారణ కమిటీ సమావేశాల అనంతరం ఆయన ముందుకు ఎలా వెళతారు, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏమిటి అనే దానిపై అందరిలోనూ ఒకింత ఆసక్తి నెలకొంది. కాగా నేడు తనను జనసేన పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా వివిధ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. మార్చి 1న గుంటూరులో జరగనున్న రౌండ్‌‌టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా పవన్‌ను రామకృష్ణ ఆహ్వానించారని తెలుస్తోంది.

సమావేశం అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ లో భాగంగానే రామకృష్ణ గారిని కలిశానని తెలిపారు. ప్రత్యేక హోదాపై టీవీల్లో చర్చలు జరుగుతుండగా దాడులు చేయడం సరైనది కాదని అన్నారు. నాపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా పట్టించుకోను, కానీ నిరసన వ్యక్తం చేసే వారిపై దాడులు చేయడం పద్ధతి కాదు అన్నారు. దేశంలోని ఎవరికైనా తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉందని, విద్యుత్ కార్మికులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నానన్నారు.

రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరవుతానో లేదో రెండ్రోజుల్లో చెబుతానని తెలిపారు. ఆ రోజున ఇతర కార్యక్రమాలు ఉన్నందున అక్కడి నిర్వాహకులకు కూడా చెప్పవలసిన అవసరం ఉందని పవన్ తెలిపారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ, పవన్‌తో వివిధ అంశాలపై చర్చ జరిగిందని, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది కాబట్టే న్యాయం చేయమంటున్నామన్నారు. ప్రత్యేక హోదా అంటే రాష్ట్ర హక్కని అదే ప్యాకేజ్ అయితే సాయం కోసం అడగవలసి ఉంటుందని రెండిటికి అదే తేడా అని గుర్తు చేశారు. హోదా కోసం పోరాడేవారిపై ఎవరు దాడులు చేస్తున్నారో వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కార్మికులు, అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రామకృష్ణ అన్నారు. ఇప్పటికే ఈ అంశం పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్, లోక్‌సత్తా జేపీలతో సహా కొందరు నేతలతో కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే….