పవన్.. ఇవిగో నువ్వడిగిన ఎన్నికలు.. పోటీ చేస్తావా ?

Tuesday, October 23rd, 2018, 07:00:04 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జరపాల్సిన పంచాయతీ ఎన్నికలు జరపండి.. మా సత్తా ఏంటో చూపిస్తాం అంటూ చంద్రబాబుకు సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. సర్పంచుల గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వ ఆ పని చేయకుండా ప్రత్యేకాధికార్లతో పాలన కొనసాగిస్తూ, దానికి అనుగుణంగా జీవో నెం 90ని కూడ విడుదలచేసింది.

దీంతో మాజీ సర్పంచులు ఎన్నికలు నిర్వహించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు జీవో 90 ని కొట్టివేస్తూ మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. బాబు సర్కారు ఇన్నాళ్లు ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణం ప్రజల్లో తమపై ఉన్న వ్యతిరేకత బయటపడుతుందని, అది అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే భయమేనని రాజకీయ వర్గాలు అంటూ వచ్చాయి. పవన్ ఇదే మాటను బలంగా నొక్కి చెబుతూ దమ్ముంటే ఎన్నికలు పెట్టండి మా సత్తా చూపుతాం అని సవాళ్లు చేశారు.

ఇక ఇప్పుడు స్వయంగా హైకోర్టు ఆదేశించింది కాబట్టి ఎన్నికలు అనివార్యం. మరి ఇన్ని రోజులు తొడలు చరుస్తూ వచ్చిన పవన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఒకవేళ పోటీ చేయాలని డిసైడైతే ఎలాంటి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments