పవన్ కి జేఎఫ్ సి ఇచ్చిన నివేదికలో ఏముంది?

Friday, March 2nd, 2018, 03:55:39 AM IST

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌ లోక్ సత్తా పార్టీ అధినేత జయ ప్రకాష్ నారాయణ్, మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్, మరియు మరికొందరు ప్రముఖులతో కలిసి కేంద్ర బిజెపి, రాష్ట్ర టిడిపి నేతలు ఏపీకి విడుదలైన నిధుల వివరణ నిజానిజాలు తేల్చేందుకు జేఎఫ్సి పేరిట ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మూడు దఫాలు పలు అంశాలపై కీలకంగా చర్చలు జరిపిన జేఎఫ్సి ప్రతినిధులు ఇన్నాళ్టికి ఒక తుది నిర్ణయానికి వచ్చి ఒక నివేదికను తయారు చేసి నేటి సాయంత్రం పవన్ కు అందజేసినట్లు తెలుస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఏపీని ముంచినట్లు ఆ నివేదికలో కమిటీ నిర్ధారించినట్లు కొందరి వాదన. ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వం ఏపీకి ఒక్కటంటే ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయాయని ‘జేఎఫ్‌సీ’ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం అందుతోంది. శుక్రవారం మరోసారి చివరిగా జేఎఫ్‌‌సీ భేటీ అయి, ఈ నివేదికపై నిశితంగా చర్చించనుందని సమాచారం. కాగా రానున్న రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని వారు పవన్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

శుక్రవారం మరోసారి సమావేశమై జేఎఫ్‌సీ నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించాలని పవన్ కళ్యాణ్ కూడా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత ఆ నివేదికను ప్రజల ఎదుటికి తెచ్చేందుకు జనసేనాని సిద్ధమైనట్లు సమాచారం. తదనుగుదంగా తప్పు ఎవరిదైనప్పటికీ పవన్ తనదైన శైలిలో జరిగిన పొరపాటులను ఏ పార్టీ చేసినప్పటికీ వాటిపై గట్టిగా ప్రజల తరపున నిలదీయాలని నిర్ణయించారట….