ఇలాంటి వారిని ఏమనాలి : వైసిపి నేత రోజా

Wednesday, April 11th, 2018, 07:05:05 PM IST

టిడిపి ప్రభుత్వం పై ఎప్పటికపుడు తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి నియోజక వర్గ ఎమ్యెల్యే ఆర్ కె రోజా. ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన ఆమె ప్రత్యర్థి పార్టీవారిని మాటలతో ఏకిపారేయడంలో పెద్ద దిట్ట. అయితే నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు ఉపయోగపడే రాజధానిని నిర్మించకుండా, ఆ భూముల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల కోసం పోరాడుతోందని చెప్పారు.

ఎంత బాధాకరమైన విషయమంటే వెంకయ్య నాయుడు తెలుగు గడ్డ మీద పుట్టిన నెల్లూరు వాసి. ఆనాడు ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య నాయుడు ఈ రోజు అధికారంలోకి వచ్చాక తన బీజేపీ, తన మిత్ర పక్షం టీడీపీ ప్రత్యేక హోదాపై ప్రజలను మభ్య పెడుతుంటే ఎందుకు మాట్లాడలేదు. తెలుగు బిడ్డ అయిన వెంకయ్య నాయుడు మోదీని ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రశ్నించారు. వెంకయ్య నాయుడికి నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్‌కి వెళ్లడానికి సమయం ఉంటుంది.

ప్రజలకు అవసరం లేని, అసత్యాలతో నిండిన ఆనందనగరి కార్యక్రమానికి రావడానికి సమయం ఉంటుంది. కానీ, ఆనాడు రాజ్యసభలో హోదా గురించి ప్రశ్నించిన విషయాన్ని గురించి మాట్లాడడానికి మాత్రం సమయం ఉండదు. ఇలాంటి వారిని ఏమనాలి అని రోజా విమర్శించారు. అంతేకాక అప్పట్లో ప్రత్యేకహోదా ముద్దు అన్న చంద్రబాబు తరువాత ప్రత్యేక ప్యాకెజీ కి ఎందుకు ఒప్పుకున్నారని, ఆ సమయంలో బిజెపితో జరిగిన లాలూచిని బాబు బయటపెట్టాలని అఆమే అన్నారు. నేడు తమ పార్టీ హోదా కోసం పోరాడుతుంటే, బాబు ఆయన పార్టీ నేతలు తమ పోరాటాన్ని తొక్కిపెట్టాలని చూడడమే కాక లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ప్రజలు అంతా గమనిస్తున్నారని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కి ఆయన పార్టీకి వారు గట్టిగా బుద్ధి చెపుతారని వ్యాఖ్యానించారు…..