తండ్రి మద్యం తాగే అలవాటు మానలేదని కొడుకు ఏమి చేసాడంటే ?

Thursday, May 3rd, 2018, 08:57:41 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మద్యం సేవించడం, తద్వారా జీవితాన్ని, ఆరోగ్యాన్ని నిండునూరేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఒక యుక్త వయసు రాగానే యువతలో చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా దీన్ని ఒక స్టేటస్ గా భావించి మరికొందరు అలవాటు చేసుకుంటున్నారు. అయితే వారి ఈ అలవాటు వల్ల ఆయా కుటుంబాలు చాలా వరకు నష్టపోతున్నాయి. నిన్న తమిళనాడులో జరిగిన ఒక హృదయవిదారక ఘటన వింటే ప్రతిఒక్కరి హృదయం చెలించక మానదు. వివరాల్లోకి వెళితే, తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా గురుకుల్ పట్టి గ్రామంలో నివాసముండే మాడసామీ, ఈసాకి అమ్మాళ్ ల కుమారుడు 17 ఏళ్ళ దినేష్ నల్ల శివన్. అయితే తొమ్మిది సంవత్సరాల క్రితం ఈసాకి అమ్మాళ్ మరణించింది.

అయితే ఆతరువాత మాడసామి మరొక వివాహం చేసుకున్నాడు. భార్య మరణం తట్టుకోలేకపోయిన అతను విపరీతంగా రోజు మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడు. అయితే రోజు లా తన తండ్రి మద్యం సేవించి ఇంటికి రావడం, ఆ మత్తులో లేనిపోని గొడవలు, అల్లర్లు చేయడం జరుగుతోంది. ఎప్పటినుండో తండ్రిని మద్యం మానేయమని దినేష్ చెపుతూనే ఉండేవాడు. అది వినేవాడు కాదు మాడసామి. ఇక తండ్రి ఈ రకమైన జీవితాన్ని, రోజు మద్యం సేవించి చేసే గొడవలను భరించలేక దినేష్ ఒకరోజు ఏకంగా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయాన్నే వాళ్ళింటికి వచ్చిన కొందరు దినేష్ తాడుకి వేలాడడం చూసి పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. కాగా స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీస్ లు దినేష్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.

అయితే ఆ సందర్భంలో దినేష్ ప్యాంట్ లో ఒక లెటర్ ను పోలీస్ లు కనుగొన్నారు. అందులో దినేష్ తన తండ్రి తాగుడు మానివేయాలని, నా చావుని చూసి అయినా నీ తీరు మార్చుకోవాలని, కనీసం నాకు తలకొరివైనా తాగకుండా పెట్టమని, అపుడే నా ఆత్మకు శాంతి చేకూరుతుందని పేర్కొన్నాడు. అంతే కాదు తమిళనాడులో వున్న మద్యం దుకాణాలన్ని మూసివేయాలని, సిఎంకి, పీఎం కి సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలని విజ్ఞప్తి చేసాడు. దినేష్ మృతితో వారింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న తండ్రి మాడసామి గుండెలు పగిలేలా రోదించాడు. తిరునల్వేలి లో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతవాసుల్లో తీవ్ర కలకలం రేపుతోంది……

  •  
  •  
  •  
  •  

Comments