కర్ణాటకలో ఆ 14మంది ఎమ్యెల్యేలు ఏమయ్యారు?

Wednesday, May 16th, 2018, 07:04:33 PM IST

కర్ణాటక ఎన్నికలు ఎన్నడూలేనంత ఆసక్తిగా జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాలు కూడా మరింత ఆసక్తిని రేకెత్తించాయి. కాగా మొత్తానికి మాదంటే మాది అధికారం అని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, జేడీఎస్ లకు ఒకవిధంగా ప్రజలు హంగ్ దిశగా తీర్పు ఇచ్చారు. బిజెపి 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 సీట్లు దక్కించుకున్నాయి. అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ బిజెపికి ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాలేదు. ఇదే అదనుగా బిజెపికి వ్యతిరేకంగా జేడీఎస్ తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. కాగా నేడు జరిగిన జేడీఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ నేతలు కుమారస్వామిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాము కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

అయితే ఈ సమావేశానికి ఇద్దరు ఆ పార్టీ ఎమ్యెల్యేలు డుమ్మాకొట్టినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ కూడా తమ పార్టీ కార్యాలయంలో ఎమ్యెల్యేలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగా 12మంది ఎమ్యెల్యేలు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఓవైపు జేడీఎస్, మరోవైపు కాంగ్రెస్ ఇలా మొత్తంగా వెరసి ఆ 14 మంది ఎమ్యెల్యేలను వెతికే పనిలో నిమగ్నమయ్యారట. కాగా 104 సీట్లు దక్కించుకున్న బిజెపి కూడా మిగిలిన 8మందిని ఏదో విధంగా తమవైపుకు తిప్పుకుని యెడ్యూరప్ప నేతృత్వంలో ప్రబుత్వఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానిక మీడియా నుండి సమాచారం అందుతోంది. దీన్ని బట్టి చూస్తే ఆ 14మంది ఎమ్యెల్యేల వెతుకులాటతో కర్ణాటక రాజకీయాలు ఎన్నడూ లేనంత రసకందాయంలో పడ్డట్లు తెలుస్తోంది…..