జనసేన ఓట్ల చీలిక ఎవరికి లాభం చేకూరుస్తుంది?

Tuesday, May 15th, 2018, 01:37:48 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తిరుమలలో వున్న విషయం తెలిసిందే. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తన బస్ యాత్రను తిరుపతి నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే జనసేనను మెల్లగా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పవన్ 2019 ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీ నినాదాలను, తాము చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు పూర్తిగా వివరించేలా ప్రణాళికలు రచిస్తున్నారట. మరోవైపు వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ప్రజల్లోకి విరివిగా చొచ్చుకెళుతున్నారు. ఆయన వెంట జనం కూడా తండోపతండాలుగా తరలి వస్తూ యాత్రను విజయవంతం చేస్తున్నారు. ఇక మిగిలింది టిడిపి.

ఇటీవల చంద్రబాబు కూడా హోదా కోసం ధర్మ పోరాట దీక్ష నిర్వచిన విషయం తెలిసిందే. ఈ దీక్ష తర్వాత చంద్రబాబు ఇటువంటి దీక్షలు మరిన్ని రాష్ట్రంలో చేపట్టి హోదా నినాదాన్ని కేంద్రానికి వినిపించేలా ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే చంద్రబాబుని, టిడిపి ని విమర్శిస్తున్న పవన్, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. దాని వల్ల ఒక ముఖ్య సామజిక వర్గం ఓట్లు జనసేనకు పడేఅవకాశం కనపడుతోంది. ఈ మేరకు ఒకింత దెబ్బ టిడిపికే తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జరిగిన 2009 ఎన్నికల్లో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నెలకొల్పి తమ సామజిక వర్గ ఓట్లను చీల్చారు.

ఆ సమయంలో అది కాంగ్రెస్ ఒంటరిపోరుకు లాభించి, టిడిపికి చేటు చేసి, అధికారం దక్కకుండా చేసింది. కాగా రానున్న ఎన్నికల్లో కూడా జనసేన ద్వారా చంద్రబాబు ఆ సామజిక వర్గాన్ని కోల్పోక తప్పదని, తద్వారా చాలావరకు సీట్లను కోల్పోవలసి వస్తుందని సమాచారం. ఒకవేళ ఇదే కనుక జరిగితే తద్వారా చాలా వరకు మేలు జరిగేది వైసిపికే అంటున్నారు విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు బయటకు వస్తున్నవి కేవలం అంచనాలే కాబట్టి, అసలు ఏమిజరుగుతుందో, ఏ పార్టీని అధికారం వరిస్తుందో తెలియాలంటే రానున్న ఎన్నికల వరకు వేచిచూడక తప్పదు మరి……..

  •  
  •  
  •  
  •  

Comments