కర్ణాటకలో అధికారం ఎవరిని వరిస్తుంది?

Friday, May 18th, 2018, 04:38:20 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఏ పార్టీ బలనిరూపణ చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనే దానిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని వుంది. ముఖ్యంగా యెడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీకి సుప్రీమ్ కోర్ట్ రేపు సాయంత్రం 4 గంటలవరకు ఎమ్యెల్యేల బలనిరూపణకు అవకాశం ఇచ్చింది. ప్రతుతం బిజెపికి వున్న ఎమ్యెల్యేల సంఖ్య 104, కాగా కాంగ్రెస్ కు 78 , జేడీఎస్ కు 37, ఇండిపెండెంట్ లు 2, జేడీఎస్ మద్దతు ద్వారా గెలిచిన బీఎస్పీ అభ్యర్థి 1 ఎంఎల్ వున్నారు. అంటే దాని ప్రకారం బిజెపికి 104 మంది కాగా, మొత్తం కాగ్రెస్, జెడిఎస్, బిఎస్పీ, ఇండిపెండెంట్ల కూటమికి మొత్తం కలిపి 118 మంది వున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 111 మంది కంటే వీరికి మెజారిటీ అభ్యర్థులే వున్నారన్నమాట. కాగా అసెంబ్లీ లో ప్రొటెం సభ కార్యాలకలాపాలు నిర్వహిస్తున్నందున ఆ ఒక్క అభ్యర్థిని తీసివేస్తే మొత్తంగా చూస్తే అసెంబ్లీ సభ్యుల సంఖ్య 221.

ఒకవేళ ఇరుపక్షాల అభ్యర్థులు సమానమైనపుడు మాత్రమే ప్రొటెం స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం లేదు. మరోవైపు యెడ్యూరప్ప బలనిరూపణ జరిగేవరకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిని నామినేట్ చేయరాదని, ఆ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీమ్ స్పష్టం చేసింది. అంటే యడ్యూరప్పకు తమకు వున్న 104 మంది కాక మరొక 7 గురు అభ్యర్థుల మద్దతు అవసరం. మాకంటే మాకు ఎక్కువ మంది అభ్యర్థుల మద్దతుందని పార్టీలు వేటికవి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే అసలు ఏ పార్టీ బలనిరూపణ చేసుకుని అధికారం చేపడుతుందో, ఏ పార్టీ చతికలబడుతుందో అనేది రేపు సాయంత్రం వరకు చెప్పడం కష్టమే మరి. అప్పటివరకు ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది మరి……