కులాల తంటా.. మతాల మంట! ఐలయ్య పెట్టిన పెంట!

Monday, September 25th, 2017, 07:30:28 AM IST

మనిషి.. ప్రపంచంలో అత్యంత తెలివైన జంతువు.. ఎంత తెలివైన జంతువు అంటే ఈ ప్రపంచాన్ని తన మాటలతో, చేతలతో శాశించెంత. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎలా ఉంటాడు అని ఎవరిని అడిగిన వెంటనే మనిషిలాగే ఉంటాడు. ఎందుకంటే ఆ దేవుడుకి రూపం ఇచ్చింది మనిషే కాబట్టి. జీవ పరిణామ క్రమంలో మనిషి ప్రయాణం తన ఆలోచన ప్రకారమే జరిగింది. అలాగే వ్యవస్థ మీద ఆధిపత్యం దిశగా సాగింది. ఈ దారిలో ఏమైందో ఏమో మనిషి తనని తాను విభజించుకోవడం మొదలు పెట్టాడు. ఎంతలా అంటే చేసిన పట్టి, ఆడిన భాష బట్టి, కట్టిన బట్ట బట్టి తనని తాను ఒక వర్గంలో సృష్టించుకున్నాడు. అయితే ఇంకా మనిషి ఎంత తెలివైన జంతువు అంటే తన జాతి మీద తానే ఆధిపత్యం ప్రదర్శించడానికి కులం, మతం అనే కొత్త కుంపటి సృష్టించాడు. ఇక్కడితో ఆగలేదు. ఒక వర్గాన్ని అంటరాని వారిగా సృష్టించాడు. వాళ్ళని బానిసలుగా భావించాడు. మరో వర్గం వారిని శ్రేష్టులుగా సృష్టించాడు. వారిని సంఘంలో గొప్ప స్థానంలో నిలబెట్టి, పాలకులుగా, తనకి తానుగా సృష్టించిన దేవుడిని పూజించే వర్గంగా విభజించాడు. ఇలా కులాల మధ్య అడ్డు గోడలని తనకు తానుగా అభివృద్ధి చేసుకున్నాడు. ఇక తరాలు మారాయి, వారసత్వాలు మారాయి, ఈ కులాల మధ్య అడ్డుగోడలు మాత్రం మనిషి తమ రక్తంలో ఆణువణువూనా నింపుకొని ఓ రకమైన మూఢవిశ్వాసంలోకి వచ్చేసాడు. అంటరానితనం అనే ఒక చీడ పురుగుని బుర్రలో నింపుకొని తనలాగే ఉండే మరో మనిషిని దూరం పెట్టడం మొదలు పెట్టాడు. అలాగే తనలాగే ఉండే మరో మనిషిని ముట్టుకోకూడదు మేము వెనుకబడిన వర్గాలకి చెందిన వాళ్ళం అనే ఆత్మన్యూనతా భావం తనతో పాటు పెంచుకున్నాడు.

అయితే ఈ వ్యవస్థలో నాగరికత మారుతూ వస్తుంది, మనిషి ఆలోచన మారుతూ వస్తుంది, తెలివైన మనిషి తనకి కావాల్సిన అన్ని ఒకదానితర్వాత ఒకటి సృష్టించుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మనిషికి మనిషి ఎంత అవసరమో గుర్తించాడు. తాను సృష్టించుకున్న కుల, మత అడ్డుగోడలని తొలగించుకొని కలిసి పనిచేయడం మొదలు పెట్టాడు. కాని ఎక్కడో ఒక రకమైన ఆలోచన అందుకే మనిషిని పరిచయం చేసుకునే సమయంలో వారి కులాన్ని పరిచయం చేసుకోవడం మొదలు పెట్టాడు. అయితే కులాల ప్రస్తావన సరళమైన భాషలో చేస్తే బాగోదని దానికి కొత్త పదాలు సృష్టించాడు. ఓసి, బీసి, ఏసీ, ఎస్టీ. దారుణమైన విషయం ఏంటంటే ప్రజలని సరైన దారిలో నడిపించి ప్రజావసరాలని తీర్చాల్సిన ప్రభుత్వాలు కూడా పిల్లాడు అక్షరాభ్యాసం చేసినప్పటి నుంచి ఉద్యోగంలో చేరే వరకు ప్రతి చోట కులాల ప్రస్తావన తీసుకొస్తూ, దరఖాస్తులో కులాన్ని ఎత్తి చూపిస్తూ అడుగడుగున నీ కుల ఇది అంటూ గుర్తుచేస్తుంది. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకి దరఖాస్తు చేసుకోవడం నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం వరకు కులం, మతం ప్రస్తావన తెస్తూనే ఉంటారు. ఇక ప్రజలని పరిపాలిస్తున్నాం అని అనుకునే రాజకీయ నాయకులు కులాల ఆధారంగా, మతాల ఆధారంగా మనుషులని విభజించి, ఓటు హక్కు అడుక్కుంటారు. అలాగే రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపాదిక మీద అభ్యర్ధులని నిలబెడతారు. ఇక రాజకీయ పార్టీలని శాశించే ఎన్నికల వ్యవస్థ కూడా కులాల ఆధారంగా రాజకీయ, ప్రాంతాల ఆధారంగా ఈ ప్రాంతంలో ఈ కులానికి చెందిన అభ్యర్ధిని నిలబెట్టాలి అని పక్కా నిబంధనలు పెడతారు.

ఇక రాజకీయ నాయకులు, కులాలని, మతాలని రెచ్చగొడుతూ అవసరం అయిన చోట బలమైన కులం వైపు నిలబడుతూ రాజకీయాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో అడుగంటిన కుల, మతం అనే చెండాలమైన ఆలోచన మనిషి అంతర్ముఖంలోకి నిండుగా ఎక్కేసింది. దీంతో మళ్ళీ రచ్చ మొదలైంది. కులాల పేరుతో , మతాల పేరుతో దూషించుకోవడం, ఒక వర్గాన్ని కించ పరుస్తూ మరో వర్గం వారు పుస్తకాలు రాయడం, ఒక మతంలో ఉండే తప్పులని ఎత్తి చూపిస్తూ మరో మతం వారు విద్వేషకరమైన వాఖ్యలు చేయడం, లేదంటే పుస్తకాలు రాయడం మొదలు పెట్టారు. దీంతో ఈ కులాలు, మతాల మధ్య వివక్ష మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ప్రాంతాల వారీగా కూడా జనాన్ని విడగొట్టి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే షో కాల్డ్ నాయకులు సమాజంలో ఎక్కువైపోయారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అందులో అందులో కొందరు మంచి పనుల కోసం, మనుషులంతా ఆలోచనలు పంచుకోవడం కోసం సోషల్ మీడియా గ్రూపులు క్రియేట్ చేస్తే అందులో కూడా కులాలు, మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వారు అభ్యంతరక పోస్టులు చేస్తూ జనాన్ని రెచ్చగొట్టడం చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో కంచె ఐలయ్య అనే ప్రొఫెసర్ ఒక కులాన్ని పూర్తిగా కించపరుస్తూ పుస్తకం రాసాడు. దానికి ఆ కులం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తే. దానిని సరి చేయాల్సిన అతను మరింత ముందుకు వెళ్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మరో వైపు పరిపూర్ణానంద స్వామి అని ఒక స్వామీజీ అతని రెచ్చగొట్టే వాఖ్యాలని వ్యతిరేకిస్తూ కాస్తా దూకుడుగా వ్యవహరించారు. దీంతో వారి గొడవ ఇప్పుడు కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే స్థాయికి చేరిపోయాయి. మరి ఈ కులాలు, మతాలని దాటుకొని మనిషి తత్త్వం ఎప్పుడు బయటకి వస్తుంది అనేది కాలమే నిర్ణయించాలి.

  •  
  •  
  •  
  •  

Comments