కెసిఆర్ క్యాబినెట్లో స్థానమెవరికి?

Friday, October 17th, 2014, 08:28:20 AM IST

trs-kcr
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ నేపధ్యంగానే కెసిఆర్ గురువారం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయినట్లు సమాచారం. అయితే తొలుత కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మంత్రి పదవులు కేటాయించడంలో అన్ని జిల్లాలకు సమ న్యాయం చెయ్యలేదనే విమర్శలను బాగా ఎదుర్కున్నారు. ఇక ఈ నేపధ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడంతో పాటు ఇటీవల వలసలతో పార్టీలు మారిన మరికొంత మందికి కూడా క్యాబినెట్ లో అవకాశమిస్తున్నారని సమీప వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాగా మహబూబ్ నగర్ నుండి జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఖమ్మం నుండి ఇటీవలపార్టీ మారిన తుమ్మల నాగేశ్వర్ రావులకు మంత్రి పదవులు దాదాపు ఖరారు అయినట్లేనని సమాచారం. ఇక హైదరాబాద్ నుండి తాజాగా టిడిపి నుండి తెరాసకు పార్టీ మారిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కూడా మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని సమాచారం. మరి కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం తలసానికి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారో లేదో వేచి చూడాల్సిందే!