‘ఎన్టీఆర్, యాత్ర’ సినిమాలు ఎన్నికల ముందే రావడం వెనకున్న అసలు కారణం !

Sunday, September 16th, 2018, 11:02:39 AM IST

మన దక్షిణాదిన కొన్ని దశాబ్దాల నుండి సినిమా రంగం రాజకీయ రంగాన్ని ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, జయలలిత, ఎంజీఆర్ లాంటి సినిమా వ్యక్తులు దక్షిణ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించారు. మన ప్రజానీకం కూడ సినిమాల్ని, రాజకీయాలు చాలా వరకు ఒకటిగానే చూస్తుంటారు. అందుకే మన రాజకీయ నాయకులు సినిమాల్ని, సినిమా తారల్ని ఎప్పుడూ విస్మరించలేదు. ఈసారి కూడ అంతే. కానీ ఈసారి సినిమా తారలతో కాకుండా సినిమాలతో జనాల్ని టార్గెట్ చేస్తున్నట్టున్నాయి అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా.

ప్రస్తుతం స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బాలక్రిష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఎన్టీఆర్ పాత్రతో సమానంగా చంద్రబాబు పాత్ర ఉండనుంది. ఆ పాత్రను రానా పోషిస్తున్నాడు. బయట కథనాలు ఎలా ఉన్నా సినిమాలో మాత్రం ఎన్టీఆర్ తో కలిసి పార్టీ నిర్మాణంలో అహర్నిశలూ కష్టపడిన, ఎన్టీఆర్ మరణానంతరం పార్టీని భుజాలపై మోసిన మహోన్నత వ్యక్తిగా చంద్రబాబును చిత్రీకరించడం ఖాయం. దీంతో బాబుపై జనాలకు ఇంకొంత సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది.

ఇక రాజశేఖర్ రెడ్డిగారి జీవితం మీద మహి రాఘవ్ ‘యాత్ర’ సినిమా చేస్తున్నాడు. ఇందులో పెద్దాయన పాత్రను మమ్ముట్టి చేస్తున్నాడు. కడప గడప దాటి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల బాధల్ని విన్న వైఎస్సార్ ను, ఆయన జనాలకు చేసిన సేవను ఘనంగా ప్రెజెంట్ చేయబోతున్నారు. దీని వలన వైఎస్సార్ అభిమానులకు, సామాన్య జనానికి మరోసారి రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తుచేసినట్టవుతుంది. దీంతో జగన్ పట్ల కొంత సానుభూతి కలిగే అవకాశం ఉంది.

ఈ రెండు సినిమాలు ఎన్నికలకు కొన్ని నెలల ముందు విడుదలవుతున్నాయి. ఇవి గనుకు విజయం సాదించినట్లైతే రాబోయే ఎన్నికల్లో తెలుగు ప్రజానీకాన్ని తప్పకుండా కొంత ప్రభావితం చేస్తాయి. ఇందుకు ఉత్తమ ఉదాహరణ 1994 ఎన్నికలకి ముందు 1993లో ఎన్టీఆర్ చేసిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రం. ఈ చిత్రం టీడీపీ శ్రేణుల్లో, తెలుగు ప్రజల్లో ఎన్టీఆర్ ఛరీష్మాన్ని మరింత పెంచి 94 ఎన్నికల్లో తెలుగుదేశం 216 సీట్లతో అఖండ విజయం సాధించడంలో ఎంతో కొంత తోడ్పడింది.

  •  
  •  
  •  
  •  

Comments