40 ఏళ్ల ఘనతను ఒక్క మాటతో పోగొట్టుకున్నారు కదా బాబుగారు !

Monday, February 11th, 2019, 07:55:55 AM IST

నిన్న గుంటూరు సభలో మాట్లాడిన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్ని వదిలేసి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుఎం పనిలో ఉన్నారని, కుమారుడు లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలా మోడీ నోటి నుండి ఒక్కో మాట వస్తుంటే వాటికి సమాధానంగా చంద్రబాబుగారి ట్విట్టర్ అకౌంట్ నుండి ట్వీట్స్ పడ్డాయి. ఏ సందర్భంలో అయితే మోడీ కుటుంబాన్ని చర్చకు తెచ్చారో ఆ క్షణం బాబుగారికి సహనం నశించిపోయింది.

వెంటనే మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారు, కుంటుంబం లేదు, బంధాలు లేవు, కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదు అంటూ ఎడాపెడా మాట్లాడేశారు. మోడీ చేసిన ఆరోపణలో నిజా నిజాలు ఏంతనేది పక్కనబెడితే చంద్రబాబు కుటుంబ సభ్యులకు రాజకీయాలతో సంబంధం ఉంది కాబట్టే, వ్యాపారాల పేరుతో ఎప్పుడూ లైమ్ లైట్లో ఉంటారు కాబట్టే వారి ప్రస్తావన తెచ్చారు మోడీ. పైగా సంబంధ బాంధవ్యాల పరిస్థితి గురించి అసలే మాట్లాడలేదు. కానీ ఎప్పుడూ ఏ సభలకు, ఏ ప్రభుత్వ కార్యక్రమాలకు, కనీసం చిన్న చిన్న వ్యాపారాల్లో కూడా లేని మోడీ భార్యను రచ్చకు లాగారు బాబు.

భారీ కుటుంబం ఉండటం, అందులోని సభ్యులు పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప పదవుల్లో, వ్యాపారాల్లో ఉండటం అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన పెద్ద అర్హత అన్నట్టు, అది ఖచ్చితంగా ఉండి తీరాలి అన్నట్టు మాట్లాడారు. ఈ మాటలు సామాన్య జనానికి సైతం నచ్చడంలేదు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ప్రత్యర్థుల వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లని బాబుగారు ఈనాడు ఇలా విచక్షణ కోల్పోయి ప్రధానిని విమర్శించడం విచిత్రంగానే ఉంది.