పవన్ వ్యాఖ్యలు పేపర్ లో చదివా : లక్ష్మి నారాయణ

Monday, April 2nd, 2018, 06:09:56 PM IST

ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారి, అలానే సీబీఐ మాజీ జేడిగా పనిచేసిన లక్ష్మి నారాయణ తన భవిష్యత్ కార్యాచరణపై త్వరలో తన నిర్ణయం తెలియచేస్తాను అన్నారు. నిన్న మీడియా తో మాట్లాడిన ఆయన, ఎవరో తాను రాజకీయాల్లోకి వస్తున్నందువల్ల తన ఉద్యోగానికి రాజీనామా చేశాను అని రాసారు. కానీ నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు అన్నారు. అయితే తన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆమోదం పొందాకే భవిష్యత్తు కార్యాచరణపై ప్రకటిస్తానని అన్నారు. హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా నేడు ఆయన ఒక మీడియా ఛానల్ తోమాట్లాడుతూ, త్వరలోనే తన సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తానన్నారు.

తన ఉద్యోగానికి రాజీనామా చేయడంలో ఉన్న వెనుక అసలు నిజాలను వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం తన వీఆర్‌ఎస్‌ దరఖాస్తు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ వద్ద ఉందని, దాని ప్రక్రియ ముగిశాక తన భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తానన్నారు. లక్ష్మీనారాయణ వస్తారంటే జనసేనలోకి స్వాగతిస్తానని పవన్‌ అనడంపై ప్రశ్నించగా, ఆ విషయాన్ని తాను పేపర్‌లో చదివానాని ఇప్పటికిప్పుడు దానిపై కామెంట్ చేయలేనని అన్నారు. తానింకా అధికారిగానే ఉన్నాను గనక తన వీఆర్‌ఎస్‌ ఆమోదం పొందాకే అన్ని అంశాలపైనా సునిశితంగా మాట్లాడతానన్నారు…..