గాంధీ హత్య వైపు గాడ్సే అడుగులు వేసింది అందుకే..!!

Monday, January 30th, 2017, 04:08:17 PM IST

gandhi-old-pic
మహాత్మా గాంధీ జీవిత చరిత్ర మనందరికీ తెలుసు.ఒక్క ఆయన మరణం గురించి తప్ప..మహాత్మా గాంధీని గాడ్సే హత్య చేసిన విషయం మాత్రమే మనకు తెలుసు. గాడ్సే గాంధీని హత్య చేయడానికి గల కారణాల గురించి ఈ జనరేషన్ లో చాలా మందికి తెలియదు. రోజు హత్యలు, క్రైం లు పెట్రేగుతున్న ప్రస్తుతం కాలంలోని యువత గాడ్సే మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. గాంధీ హత్యకు పురిగొల్పిన కారణాలు, గాడ్సే మానసిక స్థితి గురించి తెలియాలంటే 1948 నవంబర్ 8 న గాడ్సే చెప్పిన మాటలు తెలియాలి.అది గాంధీ హత్య కేసు విచారణలో చివరి రోజు. గాంధీని ఎందుకు చంపావని ప్రశ్నించగా 5 గంటలపాటు 90 పేజీల స్టేట్ మెంట్ ని చదివి వినిపించాడట. అది గాడ్సే మానసిక స్థితికి అద్దం పడుతుందని నిపుణులు అంటున్నారు.

తాను జాతికోసం చేస్తున్నాని, అసలు తాను చేసేది హింసే కాదని అనే గుడ్డి భావన గాడ్సే మనసులో బలంగా నాటుకుపోవడం వల్లే అతడు గాంధీ ని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడు. రాముడు, కృష్ణుడు, అర్జునుడు లాంటి తాను నమ్మిన దేవుళ్లంతా లోకకల్యాణం కోసం హింసని,రక్తపాతాన్ని సృష్టించారననే భావన గాడ్సే మనసులో నాటుకుపోయింది. గాంధీ లాంటి వారు అహింస అంటూ అలాంటి దేవుళ్ళకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని గాడ్సే భావించేవాడు. గాంధీ మాత్రమే ప్రాధాన్యత పొందుతున్నారని శివాజీ, రాణాప్రతాప్ వంటి వారికీ ప్రాధాన్యత తగ్గుతోందని గాడ్సే భాదపడేవాడట. అయినా ఏది తప్పు, ఏది ఒప్పో నిర్ణయించడానికి గాంధీ ఎవరని విచారణలో గాడ్సే ప్రశ్నించాడట. సౌతాఫ్రికా నుంచి వెనక్కొచ్చి గాంధీ ఓ నియంతలా మారారనే గుడ్డి భావన గాడ్సే లో ఉండడంవల్ల అతడి మానసిక స్థితి, ఆలోచనా విధానం మారిపోయి హత్య వైపు అతడిని నడిపించాయి.క్రైమ్ రేట్ పెరుగుతున్న ప్రస్తుత రోజుల్లో గాడ్సే వంటి వారి మానసిక స్థితి ప్రస్తుత జనరేషన్ కి తెలియాల్సిన అవసరం ఉందని మానసిక నిపుణులు అంటున్నారు.